Bihar Protest Video : వైరల్ వీడియోతో బీహార్‌లో కలకలం.. విద్యార్థులపై ఏకే-47తో పోలీసు కాల్పులు.. ప్రతిపక్షాలు ఫైర్!
Bihar Protest Video : బీహార్‌లోని సివాన్‌లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఏకే-47తో కాల్పులు జరిపిన పోలీసును సస్పెండ్ చేసినట్టు సమాచారం. బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
- Sreehari A
- Published on- July 27, 2026 / 04:51 PM IST
Bihar Protest Video
- వైరల్ వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ
- బీహార్ రాజకీయాల్లో భారీ దుమారం
- పోలీసు చర్యపై దర్యాప్తు, ప్రతిపక్షాల ఆగ్రహం
- బీహార్ పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
Bihar Protest Video : బీహార్‌లో విద్యార్థుల నిరసనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. సివాన్‌లో జరిగిన ఆందోళన సమయంలో ఓ పోలీసు అధికారి ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైరల్ వీడియోను షేర్ చేసిన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాల్పుల క్షేత్రంగా మార్చేసింది. విద్యార్థులు న్యాయం కోరారు. అందుకు తూటాలతో (Bihar Protest Video) సమాధానమిచ్చింది. సివాన్‌లో నిరాయుధ నిరసనకారులపై బీహార్ పోలీసులు ఏకే-47లతో కాల్పులు జరిపారు. ఇది శాంతిభద్రతలు కాదు.. ఇది ప్రభుత్వ దురాగతం.
Read Also : HYDRA Commissioner : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తొలగించాలి : హైకోర్టు కీలక ఆదేశాలు
నేరగాళ్ల కన్నా విద్యార్థులకే ఎక్కువగా భయపడే ప్రభుత్వం, పాలించే ప్రతి నైతిక హక్కును కోల్పోతుంది. బీజేపీ సమాధానం చెప్పాలి. ఈ ఆదేశం ఎవరు ఇచ్చారు? ఎవరు జవాబుదారీగా ఉంటారు?’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆప్ ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
ఈ క్రమంలోనే సంబంధిత పోలీసును అధికారులు సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పూరన్ కుమార్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలతో ఉద్రిక్తంగా మారడంతో పలుచోట్ల పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జ్ కూడా చేశారు.
సివాన్‌లో కొందరు నిరసనకారులు రాళ్లు విసిరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సివాన్ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారికి తూటాలు తగిలాయా లేదా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
