Bomb Threat: పంజాబ్‌లో హై అలర్ట్.. ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం
Bomb Threat: పంజాబ్(Punjab) లో కలకలంరేపుతున్న బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన భద్రత యంత్రంగం.
- V Santhosh Kumar
- Updated on- June 4, 2026 / 05:04 PM IST
Bomb Threat to Five Prominent Temples in Punjab
- ఐదు ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపు
- పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్
- బ్లూ స్టార్ వార్షికోత్సవం వేళ కలకలం
Punjab Bomb Threat: పంజాబ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలను బాంబులతో పేల్చివేస్తామంటూ గురువారం వచ్చిన ఒక ఈమెయిల్ సంచలనంగా మారింది. అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్ మందిర్, పటియాలాలోని మాతాకాళీ ఆలయం, భటిండాలోని మైసర్ ఖానా, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్ ధామ్ ఆలయాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. జలంధర్ ఆలయంలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి.
ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం వేళ హై అలర్ట్:
1984 జూన్‌లో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరిట భారీ సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతో మేజర్ జనరల్ బ్రార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో వేర్పాటువాద నేత భింద్రన్‌వాలే హతమవగా, 83 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చారిత్రక సైనిక చర్య జరిగి సరిగ్గా 42 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలోనే ఈ బాంబు బెదిరింపులు రావడం పంజాబ్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం:
ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం కారణంగా పంజాబ్(Punjab)లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత అమల్లో ఉండగా, ఈ మెయిల్‌తో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఇలాంటి నకిలీ ఈమెయిల్ పంపి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా నిఘా వర్గాలను రంగంలోకి దించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
