Bengaluru Tragedy: వర్ష బీభత్సం.. ఆసుపత్రి గోడ కూలి ఏడుగురు మృతి.. బెంగళూరులో పెను విషాదం
భారీ వర్షం బెంగళూరులో బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు నగరవాసులను వణికించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
- Naveen
- Updated on- April 29, 2026 / 10:26 PM IST
Bengaluru Tragedy: భారీ వర్షం బెంగళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. పెను విషాదాన్ని నింపింది. భారీ వర్షానికి ఓ ఆసుపత్రి గోడ కూలి చిన్నారి సహా ఏడుగురు చనిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరవాసులను బెంబేలెత్తించింది. ఈదురు గాలులు వణుకుపుట్టించాయి.
భారీ వర్షం కురవడంతో బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రాంతంలో కొందరు గోడ దగ్గర తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆస్పత్రి ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) కూలిపోయింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఏడుగురు చనిపోయారు. మృతులంతా వీధి వ్యాపారులని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత వాతావరణ శాఖ బెంగళూరుతో పాటు ఇప్పటికే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
భారీ వర్షం బెంగళూరులో బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు నగరవాసులను వణికించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. తూర్పు, ఉత్తర బెంగళూరులోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేసింది. కల్యాణ్ నగర్, బనసవాడి, ఆర్టీ నగర్ పరిసరాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ లో ఎంజీ రోడ్, శివాజీ నగర్, కబ్బన్ పార్క్ ప్రాంతాల్లో భారీ వాన పడింది. దక్షిణ బెంగళూరులోని జయనగర్, జేపీ నగర్, బనశంకరి ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
