Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు ప్రయాణికులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

Bus Accident : హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మలుపు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కింద ఉన్న మరో రోడ్డుపై బోల్తా పడింది.

Bus Accident

Bus Accident : హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మలుపు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కింద ఉన్న మరో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : Rishabh Pant : భూమి కావాలంటూ అర్థ‌రాత్రి రిష‌బ్ పంత్ పోస్ట్‌.. స్పందించిన సీఎం.. నిజం కాద‌ని ఫ్యాన్స్ అనుమానం..

చంబా జిల్లాలోని చురా సబ్‌డివిజన్‌లో బైరాఘర్ – తిస్సా మార్గంలో ప్రైవేట్ బస్సు రోడ్డుపై స్కిడ్ అయ్యి బోల్తా పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణంగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనను తిస్సా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్‌హెచ్‌ఓ అనుభవ్ శర్మ ధృవీకరించారు. ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులు, ఇరుకైన రహదారుల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఘటన మరోసారి ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.