Ebola Virus: గుజరాత్ లో ఎబోలా కలకలం.. కాంగో నుంచి వచ్చిన వ్యాపారవేత్తలో ఆ లక్షణాలు..! ఐసోలేషన్ లో కాంగో నుంచి వచ్చిన వ్యాపారవేత్త..
ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కాంటాక్ట్ ట్రేసింగ్, కఠినమైన ఐసోలేషన్ నిబంధనలు, నిఘా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
- Naveen
- Published on- May 28, 2026 / 08:24 PM IST
Ebola Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. గుజరాత్ లోనూ కలకలం రేపింది. ఆఫ్రికా దేశం కాంగో నుంచి వచ్చిన ఒక వ్యాపారవేత్తలో ఎబోలా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. దాంతో గుజరాత్ ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆయనను అహ్మదాబాద్ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. అంతేకాదు ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు అధికారులు. వారి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపారు.
కాగా, కాంగో నుంచి వచ్చిన వ్యాపారవేత్త ఆసుపత్రిలో చేరడానికి ముందు ముంబై, సిల్వస్సా, డామన్, వడోదర నగరాల్లో పర్యటించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కాంటాక్ట్ ట్రేసింగ్, కఠినమైన ఐసోలేషన్ నిబంధనలు, నిఘా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కొన్ని రోజుల క్రితం కాంగో నుండి ముంబైకి చేరుకున్న సదరు వ్యాపారవేత్త ఆ తర్వాత వడోదరకు వచ్చాడు. అక్కడ అతనికి జ్వరం రావడంతో వడోదరలోని బ్యాంకర్ ఆసుపత్రిలో చేరాడు. ముందస్తు జాగ్రత్తగా అతడిని అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.
ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచింది. ఎయిర్ పోర్టుల్లో ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు.
కాగా, భారత్ ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నిర్ధారణ కాలేదని వైద్య అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని కోరారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.
