రోగుల పైన దాడి చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

  • Publish Date - February 22, 2019 / 06:37 AM IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో దారుణం జరిగింది. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో గురువారం (ఫిబ్రవరి 21, 2019)న ఓ క్యాన్సర్ పేషెంట్‌ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాక ఆమె కొడుకు పై కూడ దాడికి పాల్పడ్డారు ఆస్పత్రి సిబ్బంది. 

క్యాన్సర్ పేషెంట్‌ టాయిలెట్‌కి వెళ్లాలనుకున్న సమయంలో స్టాఫ్ అందుకు నిరాకరించారు. అది కేవలం స్టాఫ్ కోసమేనని ఆమెను వారించారు. అయితే ఆమె ఎక్కువ దూరం నడిచే స్థితిలో లేకపోవడం వల్ల దగ్గరలో ఉన్న ఆ టాయిలెట్ ఉపయోగించుకోవాలనుకున్నారు. అలా వివాదం మొదలై ఆమె కొడుకుపై దాడికి దారి తీసింది. 
 

అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటామని అస్పత్రి సిబ్బంది తెలిపారు.