Ramadan : రంజాన్ పర్వదినం 2030లో రెండు సార్లు వస్తుందా..! ఎందుకలా.. ఏదైనా విపత్తుకు సంకేతమా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..
Ramadan : రంజాన్ పర్వదినం ప్రతీయేటా ఒకసారి వస్తుంది. అయితే, 2030 సంవత్సరంలో రంజాన్ పండుగ రెండు సార్లు వస్తుంది.
Ramadan
Ramadan : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్. ముస్లిం సోదరులు ఏడాది మొత్తం ఎదురు చూసే రంజాన్ మాసం బుధవారం నుంచి ప్రారంభమైంది. ముస్లిం సోదరులకు రంజాన్ పెద్ద పండుగ. 30రోజుల కఠిన ఉపవాస దీక్షలతో సాగే రంజాన్ మాసం మొత్తం పవిత్రతత, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్దలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది. అయితే, ప్రతీయేటా రంజాన్ మాసం ఒకసారి వస్తుంది. కానీ, 2030 సంవత్సరంలో రంజాన్ మాసం రెండు వస్తుండటం గమనార్హం.
రంజాన్ పర్వదినం ప్రతీయేటా ఒకసారి వస్తుంది. అయితే, 2030 సంవత్సరంలో రంజాన్ పండుగ రెండు సార్లు వస్తుంది. ఆ సంవత్సరంలో రంజాన్ పవిత్ర మాసం రెండు సార్లు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి గతంలో 1997లో చోటు చేసుకుంది. ఆ సంవత్సరంలో రంజాన్ పండుగ రెండు సార్లు వచ్చింది. మళ్లీ 2030లో మొదటి రంజాన్ జనవరి నెలలో రానుండగా.. రెండో రంజాన్ డిసెంబర్ నెలలో ప్రారంభం అవుతుంది.
2030 సంవత్సరంలో రంజాన్ రెండు సార్లు ఎందుకు వస్తుందనే దానిపై పలు విధాలుగా కథనాలు ఉన్నాయి. రంజాన్ చంద్రుని చక్రాలపై ఆధారపడిన చంద్ర క్యాలెండర్ ను అనుసరిస్తుంది. చంద్ర క్యాలెండర్ ప్రకారం.. ప్రతీ సంవత్సరం రంజాన్ దాదాపు 10 నుంచి11 రోజులు వెనక్కి వెళ్తుంది. దీని అర్ధం రాబోయే సంవత్సరాల్లో, రంజాన్ గ్రెగోరియన్ సౌర క్యాలెండర్ సంవత్సరం ప్రారంభానికి దగ్గరగా ఉంటుంది.
2030లో చంద్ర క్యాలెండర్ సమయం ప్రకారం.. రంజాన్ జనవరి 4వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీన ముగుస్తుందని అంచనా వేయబడింది. అదే ఏడాది డిసెంబర్ 26వ తేదీ రంజాన్ పర్వదినం వస్తుందని అంచనా. దీంతో రంజాన్ 2030లో రెండు సార్లు వస్తుంది. ఇదే తరహాలో మళ్లీ 2063 సంవత్సరంలో రెండు సార్లు రంజాన్ పండుగ రానుంది. ఇది కేవలం యాదృశికమేనని.. దీని వల్ల ఎలాంటి విపత్తులకు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు.
గల్ఫ్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హసన్ అహ్మద్ అల్ హరిరి మాట్లాడుతూ.. సౌర క్యాలెండర్, చంద్ర క్యాలెండర్ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. సౌర క్యాలెండర్ సూర్యుడితో స్థిరంగా ఉంటుంది, అయితే చంద్ర క్యాలెండర్ ప్రతీయేటా 11 రోజులు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకే ఏడాదిలో రెండు రంజాన్లను కలిగి ఉండటం, రెండు వేర్వేరు క్యాలెండర్లను కలిగి ఉండటం యొక్క సహజ ఫలితం. క్యాలెండర్లను మానవులు కనుగొన్నారు, కాబట్టి మనం దానిని ఒక ప్రమాణంగా, సమయాన్ని లెక్కించడానికి ఉపయోగించవచ్చు. ప్రజలు రెండు రంజాన్లను సహజమైన విషయంగా చూడాలని ఆయన అన్నారు.
