NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దూకుడు, మరొకరు అరెస్ట్, దేశవ్యాప్తంగా 14 చోట్ల తనిఖీలు
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీశా మంధరేకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు.
- Naveen
- Updated on- May 17, 2026 / 09:33 PM IST
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ప్రశ్నాపత్రం లీక్ చేసిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టింది. 24 గంటల్లో దేశంలోని 14 చోట్ల అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ధనంజయ్ లో ఒకరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, రాజస్తాన్, హరియానాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. మనీశా మంధరే, కులకర్ణి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీశా మంధరేకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. బోటనీ టీచర్ మనీశాను సీబీఐ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీలో మనీశా కీలకంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపింది సీబీఐ. బోటనీ జువాలజీ ప్రశ్నాపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలు అని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీశా ఈ కుట్రలో కీలక పాత్రధారులు అని తెలిపింది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతున్నాయని న్యాయస్థానానికి సీబీఐ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకుంది సీబీఐ.
ఈ క్రమంలో మనీశాను విచారించేందుకు 14 రోజుల కస్టడీ కోరింది. ఈ కేసుకి సంబంధించి వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఇక లీకేజీ సూత్రధారి నీట్ కమిటీలో కెమిస్ట్రీ నిపుణుడిగా ఉన్న పీవీ కులకర్ణిని సీబీఐ శుక్రవారమే అరెస్ట్ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం రూపకల్పనలో సభ్యులుగా ఉన్న వారికి మొత్తం ప్రశ్నలు తెలిసే అవకాశం తక్కువగా ఉండటంతో ఇతర సబ్జెక్టుల నిపుణులతో కలిసి కులకర్ణి లీకేజీకి పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ముందుగానే బోటనీ టీచర్ మనీశా, కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి ముందే సేకరించి బయటకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది.
పరీక్ష ప్రశ్నాపత్రాన్ని మొదట చేతితో రాసి తర్వాత స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో పంపినట్లుగా విచారణలో వెల్లడైంది. గెస్ పేపర్ పేరుతో సుమారు 400 ప్రశ్నల సెట్ ను విద్యార్థులకు అందించారు. అందులో అసలు పరీక్షలో వచ్చిన బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాలను అందించేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో మధ్యవర్తి నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేసినట్లుగా సీబీఐ గుర్తించింది. రాజస్తాన్, మహారాష్ట్ర, హరియానా, కేరళం వంటి రాష్ట్రాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పుణె నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రశ్నాపత్రం లీక్ కావడంలో శుభం కైగనార్ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.
Also Read: తాలిబన్ల కొత్త రూల్స్.. ‘పెళ్లప్పుడు కన్య మౌనంగా ఉంటే..’
