Central Government Employees : బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్!
Central Government Employees : బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
- Harish Thanniru
- Updated on- September 24, 2026 / 08:48 PM IST
Central Government Employees
Central Government Employees : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడురోజులు (సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు) సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌ను ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది.
Also Read : Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!
బ్యాంకు సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్లు జమ కావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెప్టెంబర్ నెల వేతనాలు, పెన్షన్లను ఐదు రోజుల ముందుగానే అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా నెలాఖరులో జరిగే చెల్లింపులు సమ్మె ప్రభావంతో ఆలస్యం కాకుండా ముందస్తుగా చెల్లింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మరోవైపు మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 27న ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆ రోజు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. సమ్మెకు ముందు రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా నెలాఖరులో నగదు లావాదేవీలు, జీతాలు, పెన్షన్లు తదితర ముఖ్యమైన చెల్లింపుల్లో అంతరాయం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి.
