Petrol Diesel Sales : కేంద్రం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత.. కారణాలివే..

Petrol Diesel Sales : పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి ఉపసంహరించుకుంది. ఈ మేరకు జూన్ 29వ తేదీన కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Central Government Lifts Petrol Diesel Sale Restrictions From July 1

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత
  • జులై 1 నుంచి నిబంధనలు అమల్లోకి

Petrol Diesel Sales : వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై గతంలో విధించిన తాత్కాలిక ఆంక్షలను జులై1 వ తేదీ నుంచి ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో వాణిజ్య వినియోగదారులు మళ్లీ సాధారణ పెట్రోల్ బంకుల నుంచే పరిమితులు లేకుండా ఇంధనం కొనుగోలు చేయొచ్చు.

పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి ఉపసంహరించుకుంది. ఈ మేరకు జూన్ 29వ తేదీన కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించిన తరువాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇకనుంచి ఈ ఆంక్షలు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

ప్రభుత్వం తాజా నిర్ణయంతో వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత వినియోగదారులు మళ్లీ సాధారణ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొచ్చు. అలాగే వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే పరిమితిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. భారతదేశంలోనూ ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీంతో జూన్ 12న పెట్రోల్, డీజిల్‌పై తాత్కాలిక ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు పెంచడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడంతోపాటు సాధారణ వినియోగదారులకు ఇంధనం నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ మెరుగుపడటంతో ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఇంధన విక్రయాలు సాధారణ విధానంలో కొనసాగనున్నాయి.