అన్ని కార్లలో ఇక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
- venkaiahnaidu
- Published On : December 29, 2020 / 04:35 PM IST
dual front airbags mandatory అన్ని కార్లల్లో ముందు సీట్ల ప్రయాణీకుల వైపు కూడా ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి అని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం(డిసెంబర్-29,2020) ప్రతిపాదించింది. గతంలో అన్ని కార్లలోని డ్రైవింగ్ సీటుకి ఎయిర్ బ్యాగ్ ని తప్పనిసరి చేసిన కేంద్రం…ఇప్పుడు డ్రైవర్ పక్క సీటుకి కూడా ఎయిర్ బ్యాగ్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసిన ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం… ఏప్రిల్-1,2021నుంచి మ్యానుఫ్యాక్చర్(ఉత్పత్తి)చేసే అన్ని మోడల్ కార్లకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అన్న నిబంధనను అమలు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఇదే సమయంలో ప్రస్తుతమున్న కార్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాలనే నిబంధనను విధించనున్నారు. దీనికి జూన్ 1 వరకు గడువు ఇవ్వనున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది ప్రభుత్వం. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్టు ధరించకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని తప్పనిసరి చేస్తే.. ఇక కార్లు, ఇతర వాహనాల ఉత్పత్తిదారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. పాత వాహనాలకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ అమర్చే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు దీన్ని ఆసరాగా తీసుకొని ప్రజలపై అధిక భారం వేసే ప్రమాదం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.
