E20 Janatha Party: CJP సూపర్ హిట్.. పుట్టుకొచ్చిన మరో రెండు కొత్త పార్టీలు.. నెక్ట్స్ టార్గెట్..
సీజేపీ అందించిన స్పూర్తితో ఇప్పుడు సామాన్య వాహనదారుల హక్కుల కోసం 'E-20 జనతా పార్టీ(E20 Janatha Party)' పేరుతో మరొక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది.
- V Santhosh Kumar
- Published on- July 27, 2026 / 12:56 PM IST
Cjp success e20 janata party launches protest for pure petrol
- ప్రజాదరణ పొందిన సీజేపీ పార్టీ
- పుట్టుకొచ్చిన E 20 జనతా పార్టీ
- ప్యూర్ పెట్రోల్ కోసం పోరాటం
E20 Janatha Party: ప్రజా సమస్యలపై నిలదీస్తూ, పాలకులను ప్రశ్నిస్తూ ఆవిర్భవించిన సీజేపీ పార్టీ స్వల్ప కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొంది సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ‘నీట్ (NEET) పేపర్ లీకేజ్’ వ్యవహారంపై CJP నిర్వహించిన భారీ నిరసనలు, ధర్నాలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. అన్యాయానికి గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వైపు నిలబడి పోరాడిన తీరుతో ఈ పార్టీ ప్రజా క్షేత్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రజల సమస్యలనే ఎజెండాగా మలుచుకుని సీజేపీ చేపట్టిన ప్రస్థానం, సాధించిన విజయం ఇప్పుడు రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.
రంగంలోకి ‘E-20 జనతా పార్టీ’
సీజేపీ అందించిన స్పూర్తితో ఇప్పుడు సామాన్య వాహనదారుల హక్కుల కోసం ‘E-20 జనతా పార్టీ(E20 Janatha Party)’ పేరుతో మరొక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (E-20) కలపడం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని, మైలేజ్ తగ్గి సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఈ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. సీజేపీ ఎలాగైతే నీట్ పేపర్ లీక్‌పై ఉద్యమించిందో, అదే స్థాయిలో E-20 ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయెల్‌కు వ్యతిరేకంగా ఈ నయా పార్టీ తన నిరసన గళాన్ని విప్పేందుకు సమాయత్తమవుతోంది.
ప్రతి ఒక్కరికీ ‘ప్యూర్ పెట్రోల్’ పొందే హక్కు:
ప్రతి వాహనదారునికి ఎటువంటి కల్తీ లేని ‘ప్యూర్ పెట్రోల్’ కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ, అవకాశం కల్పించాలనేది E-20 జనతా పార్టీ యొక్క ప్రధాన డిమాండ్. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వద్దనుకునే వారికి 100% ప్యూర్ పెట్రోల్‌ను పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పార్టీ ఉద్యమించనుంది. సామాన్య ప్రజల నిత్య జీవితాన్ని దెబ్బతీస్తున్న ఇంధన సమస్యపై ఈ E-20 జనతా పార్టీ ఎలాంటి పోరాటాలు చేయబోతుందోనని అంతటా ఆసక్తి నెలకొంది. మరి ఈ కొత్త పార్టీ ప్రయాణం కూడా సీజేపీ లాగానే విజయం సాధిస్తుందా అనేది చూడాలి.
