CM Bhagwant Mann : ఆ వీడియోలో వ్యక్తి నేను కాదు.. అంతా ఫేక్.. మద్యం వీడియోపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్లారిటీ..!
CM Bhagwant Mann : వైరల్ వీడియో వివాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విలేకరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ప్రత్యర్థులు ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేశారని ఆరోపించారు.
- Sreehari A
- Published on- June 25, 2026 / 09:42 PM IST
CM Bhagwant Mann
CM Bhagwant Mann : పంజాబ్ రాజకీయాల్లో సీఎం భగవంత్ మాన్ ఫేక్ వీడియోలు సంచలనం రేపుతున్నాయి.. వరుసగా ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడంతో రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ వైరల్ వీడియో వివాదంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్లారిటీ ఇచ్చారు. మొహాలీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ప్రత్యర్థులు ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేశారని ఆరోపించారు.
తనను అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని సీఎం మాన్ అన్నారు. వివాదాస్పద వీడియోను చూపిస్తూ.. అందులో ఉన్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ వీడియోను మాస్క్ ధరించి రికార్డు చేశారన్నారు. అన్ని పార్టీలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని మాన్ చెప్పారు. తనను బహిష్కరిస్తూ గురుద్వారాల బయట పోస్టర్లు పెట్టారని, కానీ సుఖ్‌బీర్ బాదల్‌కు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా మతపరమైన ఫత్వాలను కూడా జారీ చేస్తున్నారని తెలిపారు.
ఫేక్ వీడియోలతో రాజకీయ కుట్ర :
వివాదాస్పద వీడియో ఫేక్ అంతా కల్పితమన్నారు. ఇది రాజకీయ కుట్రగా సీఎం మాన్ అభివర్ణించారు. పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు తనను అప్రతిష్టపాలు చేసేందుకు ఇలా తప్పుడు వీడియోలను సృషించాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల వద్ద సరైన సమస్యలు లేవని, అందుకే ఇలా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రచారానికి పాల్పడుతున్నారని సీఎం ఆరోపించారు. చిన్నప్పటి నుంచి తనకు మెడ భాగంలో సర్జరీకి సంబంధించి చిన్న గీత ఉందని, వీడియోలో వ్యక్తికి అది లేదన్నారు. వీడియోలో వ్యక్తి తన ఎత్తుకు కనీసం 2 అంగుళాల తేడా ఉందని వివరించారు.
ఫేక్ వీడియోను క్రియేట్ చేసేందుకు మాస్క్ ధరించారని, మెడ దగ్గర చిన్న గీతను మార్ఫింగ్ చేయలేదని అన్నారు. ఈ వీడియోతో ప్రతిపక్షాల కుట్ర బయటపడిందని అన్నారు. ఈ వీడియోపై ఎలాంటి దర్యాప్తుకైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. వైరల్ వీడియోలో కనిపించే వ్యక్తి ఆకారం, శరీరాకృతి, నడక, ప్రవర్తన తనతో సరిపోలడం లేదని ఆయన అన్నారు. అయినప్పటికీ, రాజకీయ ప్రత్యర్థులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.
పంజాబ్ ప్రజలపైనా, నానక్ నామ్ లేవా సంగత్‌పైనా తనకు పూర్తి విశ్వాసం ఉందని మాన్ అన్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. విద్యుత్, నీరు, రోడ్లు, ఆసుపత్రులు, ఆమ్ ఆద్మీ క్లినిక్‌లు, ఉపాధి వంటి ప్రజా సేవలను అందించడంపైనే తన దృష్టి ఉంటుందన్నారు.
మతపరమైన కారణాలతో తనను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. తనను బహిష్కరిస్తూ గురుద్వారాల బయట పోస్టర్లు పెట్టాలని శిరోమణి కమిటీ ఆదేశించినట్టు తెలిపారు. మత దూషణ ఘటనలకు అకాలీ దళ్, సుఖ్‌బీర్ బాదల్ బాధ్యతను అంగీకరించినా వారిపై అలాంటి పోస్టర్లు ఎందుకు పెట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Read Also : LPG Cylinders : గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ LPG సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత..!
ల్యాబ్ ఆపరేటర్లకు బెదిరింపులు :
వీడియోను పరిశీలించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఇప్పుడు అదే ల్యాబ్ నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని బెదిరింపులతో ఒత్తిడితో వేధిస్తున్నారని సీఎం అన్నారు. బీజేపీ, అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ల్యాబ్ యజమానులను ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు.
2027 గురించి ప్రతిపక్షంలో ఆందోళన :
తమ మద్దతు స్థావరాన్ని కోల్పోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఏఐతో తప్పుడు ప్రచారంపై ఆధారపడుతున్నాయని మాన్ అన్నారు. 2027లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు నిరాశ చెందాయని పేర్కొన్నారు. అంతిమంగా, నిర్ణయం తీసుకునేది పంజాబ్ ప్రజలేన్నారు.
ఫొటోలపై మద్యం విసిరే వీడియో వైరల్ :
2025 అక్టోబర్‌లో ఎన్నారై ఆన్‌లైన్‌లో ఈ వీడియోను పోస్టు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వైరల్ క్లిప్‌లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్యం గ్లాసు పట్టుకుని ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మొహాలీలో విలేకరుల సమావేశంలో భగవంత్ మాన్ దీనిపై స్పందిస్తూ.. ఈ వీడియోను కెనడాకు చెందిన పంజాబీ ఎన్నారై క్రియేట్ చేశాడని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
అయితే, ఆ వీడియోలో భగవంత్ మాన్ పోలిన వ్యక్తి సిక్కు గురువుల చిత్రపటాల వద్ద నిలిబడినట్టుగా కనిపిస్తుంది. గ్లాసులోని మద్యాన్ని అక్కడి పవిత్ర చిత్రపటాలపై విసురుతున్నట్టుగా కనిపించింది. దాంతో శిరోమణి అకాలీ దళ్ (SAD), అనేక సిక్కు మత సంస్థలు ఈ ఫుటేజీని తీవ్రంగా ఖండించాయి. సిక్కు మర్యాద ఉల్లంఘన, గురువుల పట్ల తీవ్ర అగౌరవ చర్యగా అభివర్ణించాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీఎం ఆఫీసుకు సంబంధిత వర్గాలు మొదట ఈ ఆరోపణలను ఖండించాయి. ఆ వీడియో పూర్తిగా ఏఐతో క్రియేట్ చేశారని, సీఎం ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన డీప్‌ఫేక్ అంటూ మండిపడ్డారు. ఈ వివాదం నేపథ్యంలో, శిరోమణి అకాలీ దళ్ ఆ వీడియోకు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసింది.
