CM Mohan Yadav : సీఎం ఇంటిని కూల్చివేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే?
CM Mohan Yadav : సింహస్థ మహాకుంభమేళా కోసం ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న వేళ సీఎం మోహన్ యాదవ్ పూర్వీకుల ఇంటిని స్వయంగా గునపంతో కూల్చివేతను ప్రారంభించారు.
- Sreehari A
- Published on- September 28, 2026 / 05:31 PM IST
CM Mohan Yadav
- చిన్ననాటి ఇంటికి చివరి వీడ్కోలు..
- సీఎం మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం
- పూర్వీకుల ఇంటిని స్వయంగా కూల్చిన సీఎం
- గడప వద్ద గునపం పట్టిన ముఖ్యమంత్రి..
- భావోద్వేగానికి గురైన మోహన్ యాదవ్
CM Mohan Yadav : సింహస్థ మహాకుంభమేళా కోసం ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ కోసం మార్గమధ్యలో కొన్ని ఇళ్లను కూల్చాల్సి వచ్చింది.
అయితే, అదేమార్గంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూర్వీకుల ఇల్లు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం తొలగించాల్సిన కట్టడాల లిస్టులో సీఎం పూర్వీకుల ఇల్లు ఉండగా అక్కడి అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
అయితే, ఆ ఇంటి కూల్చివేతను స్వయంగా సీఎం ప్రారంభించారు. 2028లో మధ్యప్రదేశ్‌లో సింహస్థ మహాకుంభమేళా జరగనుంది. దీనికి సంబంధించి ఉజ్జయినిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Read Also : Stock Market Crash : మార్కెట్లకు మళ్లీ చమురు సెగ.. ఒక్కరోజే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
ఇందులో భాగంగా రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న 272 కట్టడాలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అందులో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూర్వీకుల ఇల్లు కూడా ఉంది. కూల్చివేతకు ముందు ఆ ఇంట్లో సీఎం స్వయంగా పూజలు నిర్వహించారు.
ఇంటి ముందు గడపను కూల్చిన సీఎం :
అనంతరం అధికారులు ముందుకు రాగా, సీఎం మోహన్ యాదవ్ స్వయంగా గునపం చేత పట్టుకుని ఇంటి ముందు గడప వద్ద తొలి దెబ్బ కొట్టారు. దీంతో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. చిన్ననాటి జ్ఞాపకాల ఇల్లు కావడంతో ఈ సందర్భంగా తనకు భావోద్వేగంగా అనిపించిందని సీఎం యాదవ్ తెలిపారు.
బాల్యంలో తాను ఆడుకున్న ప్రదేశాన్ని ఇప్పుడు తన చేతులతోనే కూల్చాల్సి రావడం బాధ కలిగించిందని చెప్పారు. అయితే, పరిపాలన, సింహస్థ మహాకుంభమేళా ఏర్పాట్లు, సమాజ ప్రయోజనం కోసం ఇలాంటి త్యాగాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్యతో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న ప్రజల్లో ధైర్యం కల్పించాలనే ఉద్దేశం కూడా ఉందని సీఎం తెలిపారు. సింహస్థ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. నివేదికల ప్రకారం.. ఈ పూర్వీకుల ఇల్లు సీఎం తండ్రి పూనమ్ చంద్, అంకుల్ శంకర్ లాల్ పేర్లపై నమోదై ఉంది. సీఎం తాత శ్రీరామచంద్ర 1974లో ఈ ఇంటిని నిర్మించినట్లు తెలిసింది.
