Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ మరో ధర్నా.. డేట్, ప్లేస్ ఇదే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే!
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మరో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు 'కాక్‌రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party)' ప్రకటించింది.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 03:52 PM IST
cockroach janata party announced another massive protest at Delhi Ramlila Maidan
- పేపర్ లీక్‌లపై విద్యామంత్రి రాజీనామా డిమాండ్
- ఆందోళనలో పాల్గొన్న సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్
- జూన్ 23న రాంలీలా మైదాన్ చలో
Cockroach Janata Party: ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party) నిర్వహించిన తొలి భారీ ప్రత్యక్ష నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్, యూపీఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కింగ్ అవకతవకలపై దేశ యువత రోడ్డుపైకి వచ్చింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. “మేము పన్నులు కడితేనే విద్యామంత్రికి జీతం వస్తోంది, కానీ మా భవిష్యత్తుకే దిక్కులేదు” అంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.
APSRTC Bus Fire: రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు.. ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
నిరసన క్షేత్రంలో సోనమ్ వాంగ్చుక్: గాంధేయ మార్గంలో పోరాటం
ఈ ఆందోళనకు ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “నాకు నిరసనలు చేయడం నచ్చదు, కానీ న్యాయం కోసం రాక తప్పలేదు” అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఆయనను దేశ విద్యామంత్రి కావాలని కోరగా.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, యువతే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పొలిటీషియన్లు, ఐఏఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు చేతుల్లో జాతీయ జెండాలు, పుస్తకాలు పట్టుకుని, భద్రతా సిబ్బందికి గులాబీ పూలు అందిస్తూ శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
భయపడేది లేదు.. జూన్ 23న రాంలీలా మైదాన్ చలో!
అమెరికా నుండి నేరుగా నిరసన స్థలానికి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. ప్రభుత్వంపై గళం విప్పితే ఎక్కడ జైల్లో పెడతారోనని దేశంలో ప్రతి తల్లి భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయగలదేమో కానీ, తమ గొంతుకను నొక్కలేదని స్పష్టం చేశారు. “దేశ యువత ఇక భయపడదు, పోరాడుతుంది.. బొద్దింకలు ఎప్పటికీ చావవు” అని ఆయన గర్జించారు. పేపర్ లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించిన అనంతరం, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ జూన్ 23న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మరో భారీ నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.
