Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు సమర్పించింది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు అందించింది. ఇంతకుముందే 119 మంది ఎంపీల సంతకాలను కాంగ్రెస్ సేకరించినట్లు తెలుస్తోంది.
ఇటీవల లోక్‌సభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు అంశాలపై అభ్యంతరాలు చెబుతూ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అలాగే, ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ మహిళా ఎంపీలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టకపోవడంతో విపక్షాలు ఓం బిర్లాపై అభ్యంతరాలు తెలిపాయి.
దీంతో, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆఫీసులో నిన్న విపక్ష పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
లోక్‌సభ విధివిధానాల నిబంధన 94సీ కింద ఇవాళ మధ్యాహ్నం 1.14 గంటలకు అవిశ్వాస తీర్మానం నోటీసును సమర్పించినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. సభా కార్యకలాపాల నిర్వహణపై పదే పదే ఫిర్యాదులు రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంలో 119 మంది ఎంపీల సంతకాలు ఉన్నాయని తెలిపారు.