దస్ సాల్, అన్యాయ్ కాల్.. మోదీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ డాక్యుమెంట్
- Naga Srinivasa Rao Poduri
- Published on- February 15, 2024 / 01:18 PM IST
congress releases document on modi 10 years rule
Digvijay Singh: మోదీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని.. మోదీ చెప్పినట్టు ఇది అమృత్ కాల్ కాదు, దేశానికి వినాశ్ కాల్ అని వ్యాఖ్యానించారు. మతం పేరుతో మోదీ సర్కారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
”పీవీ నరసింహా రావు కాలంలోనే రామాలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయొద్దని మొదటి నుంచి కాంగ్రెస్ ఆలోచించింది. సనాతన ధర్మం ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతనే ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. రాముడి జన్మదినం ఏప్రిల్ లో ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశ్యంతో గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రణ ప్రతిష్ఠ చేశారు. సతీసమేతంగా కలిసి చేయాల్సిన పూజను మోదీ, మోహన్ భగవత్ ఒక్కొక్కరే కూర్చొని నిర్వహించి సనాతన ధర్మాన్ని కించపరిచారు.
బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ తో పాటు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి. కేంద్రంలో అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని కాంగ్రెస్ మాట ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. మహిళలపై అత్యాచారాలు మోదీ సర్కార్ నిలవరించలేకపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మోదీ లాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ లేదు. మోదీ ప్రభుత్వానికి దాదాపు పదేళ్లు అయ్యాయి. మోదీ పాలనపై మేం రిపోర్ట్ విడుదల చేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై మోదీ చేసిన అన్యాయాలను డాక్యుమెంట్ లో రూపొందించాం.
Also Read: ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్.. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంపై సంచలన తీర్పు
దేశ రక్షణ విషయంలో మోదీ విఫలమయ్యారు. దేశ రక్షణ విషయంలో రక్షణ శాఖ మంత్రి ఒకటి చెప్తే ప్రధాని మరొకటి చెప్తారు. దేశంలో మోదీ ద్వేషాన్ని పెంచుతున్నారు. ప్రేమ పంచడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారు. వసుదైక కుటుంబం మా ఆలోచన. భారత రాజ్యాంగ ఆలోచన కూడా అదే. బీజేపీ మాత్రం ప్రజలను విడగొడుతోంది. కేంద్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం మా మొదటి లక్ష్యం. మోదీ పాలనలో పేదవాళ్ళు మరింత పేదవారిగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. పీయూష్ గోయల్ వ్యవసాయ మంత్రి కాదు.. కార్పొరేట్ కంపెనీల మంత్రి” అంటూ దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు.
