ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తప్ప, మిగిలిన అన్ని సమయాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలనే తలంపుతో ఉంది. నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయడంలో విఫలమయ్యే డిస్కంలపై జరిమానా విధించేందుకూ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె.సింగ్ ఫిబ్రవరి 26 మంగళవారం గురుగ్రామ్ లో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో నిర్వహించే సమావేశంలో ఈ పథకంపై విస్తృతంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా విషయమై కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా రాష్ట్రాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.
ఇందుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఏప్రిల్ 1 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గ్రిడ్ లను అనుసంధానించడం ద్వారా ఈ పథకం అమలుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. గ్రిడ్ ల అనుసంధానం వల్ల జమ్మూకాశ్మీర్ లోని జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ ను కన్యాకుమారికి, గుజరాత్ సౌర విద్యుత్ ను అరుణాచల్ ప్రదేశ్ కు సరఫరా చేయడం వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.