FASTag Annual Pass: ఫాస్టాగ్ యానువల్ పాస్.. ఎలా అప్లయ్ చేసుకోవాలి, ఫీజు ఎంత, వ్యాలిడిటీ, రూల్స్.. పూర్తి వివరాలు..
ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే వర్తిస్తుంది.

FASTag Annual Pass: ఫాస్టాగ్ కు సంబంధించి వాహనదారులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్టాగ్ యానువల్ (వార్షిక) పాస్ ను ప్రవేశపెట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే ఈ చొరవ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు వారి ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు చౌకగా మార్చడం మరో లక్ష్యం. పదే పదే రీఛార్జ్ చేసే శ్రమను తగ్గించడం, టోల్ లావాదేవీలను వేగవంతం చేయడం, ప్లాజాల దగ్గర రద్దీని తగ్గించడం, టోల్ ప్లాజాల దగ్గర చెల్లింపులను మరింత ఈజీ చేయడం ఈ చొరవ ఉద్దేశ్యం.
ఈ వార్షిక పాస్ ధర 3వేలు. ఈ మొత్తాన్ని చెల్లించిన ప్రైవేట్ వాహన యజమానులు ఏడాది పాటు లేదా 200 వరకు టోల్ క్రాసింగ్‌ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ పాస్‌ను కొనుగోలు చేయాలంటే వాహనానికి ఇప్పటికే ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి. ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పాస్ కేవలం NHAI, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్, అటల్ సేతు వంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రహదారులపై ఈ పాస్ పనిచేయదు. ఆయా మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి యథావిధిగా టోల్ రుసుము కట్ అవుతుంది.
మరో ఇంపార్టెంట్ విషయం.. ఒక వాహనంపై తీసుకున్న పాస్‌ను మరో వాహనానికి బదిలీ చేయడానికి వీలుండదు. అలాగే, 200 ట్రిప్పులు లేదా ఏడాది గడువు ముగిసిన తర్వాత పాస్ గడువు ముగుస్తుంది. వినియోగదారులు కావాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌కు ఆటో-రెన్యూవల్ సౌకర్యం లేదు.
FASTag వార్షిక పాస్ అంటే ఏమిటి?
ఈ సంవత్సరం జూన్‌లో FASTag వార్షిక పాస్ ప్రకటించబడింది. ఇది కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా ప్రీపెయిడ్ టోల్ ప్లాన్.
“60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనలను పరిష్కరించడం.. సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేయడం దీని లక్ష్యం” అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్ ప్లాజాల దగ్గర వేచి ఉండే సమయాన్ని, రద్దీ, వివాదాలను తగ్గించడం ద్వారా లక్షలాది మంది ప్రైవేట్ వాహన యజమానులకు వేగవంతమైన, సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం వార్షిక పాస్ లక్ష్యం” అని వివరించారు.
* యానువల్ పాస్ ను ఇప్పటికే ఉన్న FASTagకి నేరుగా లింక్ చేయవచ్చు. (ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి, మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ చేయబడి ఉండాలి).
* ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, ముంబైరత్నగిరి మార్గాలు.
* రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై యానువల్ పాస్ పని చేయదు. సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. ఫాస్ట్ ట్యాగ్ యథావిధిగా పనిచేస్తుంది. ముంబైపూణే ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి మహామార్గ్), అటల్ సేతు, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే వంటి కొన్ని రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రాష్ట్ర అధికారులు నడుపుతారు. ఈ దారుల్లో యానువల్ పాస్ పని చేయదు.
* ఈ ప్లాన్ పదే పదే ఆన్‌లైన్ రీఛార్జ్‌లను నివారిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్ బదిలీ చేయబడదు. ఒకే రిజిస్టర్డ్ వాహనంతో లింక్ చేయబడిన FASTagతో మాత్రమే పనిచేస్తుంది.
FASTag వార్షిక పాస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?
* రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI/MoRTH వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* మీ వాహన నంబర్, FASTag ID వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. (FASTag యాక్టివ్‌గా ఉండాలి, సరిగ్గా ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి. మీ వాహనానికి లింక్ చేయబడి ఉండాలని గమనించాలి).
* UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి రూ. 3,000 ఆన్‌లైన్‌లో చెల్లించండి.
* పాస్ మీ ప్రస్తుత FASTagకి జత చేయబడుతుంది. ఆగస్టు 15న యాక్టివేషన్‌ను SMS నిర్ధారిస్తుంది.
FASTag వార్షిక పాస్: రూల్స్ అండ్ లిమిట్స్
* ఆగస్టు 15 నుండి, మీ వాహనం NHAI లేదా MoRTH కింద FASTag-ప్రారంభించబడిన టోల్ ప్లాజాను దాటిన ప్రతిసారీ ఒక ట్రిప్ తీసివేయబడుతుంది.
* 200 ట్రిప్పుల పరిమితి లేదా ఒక సంవత్సరం మార్కును చేరుకున్న తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్ గా సాధారణ పే-పర్-యూజ్ FASTagకి తిరిగి మారుతుంది.
ముఖ్యమైన నియమాలు:
* ప్రైవేట్ వాహనాలకు మాత్రమే.. వాణిజ్య వాహనాలకు చెల్లదు.
* బదిలీ చేయబడదు, తిరిగి చెల్లించబడదు- రిజిస్టర్డ్ వాహనానికి మాత్రమే పనిచేస్తుంది.
* పరిమిత కవరేజ్: అర్హత కలిగిన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో మాత్రమే చెల్లుతుంది.
* నో ఆటో రెన్యువల్ : గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి.