పాన్ మసాలా కోసం ఆసుపత్రి నుంచి క‌రోనా రోగి ప‌రారీ, కుటుంబం మొత్తం క్వారంటైన్

  • Publish Date - July 14, 2020 / 09:26 AM IST

కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా, కొందరిలో మార్పు రావడం లేదు. సిల్లీ రీజన్స్ తో తమ ప్రాణం మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. పాన్ మసాలకు బానిసైన ఓ కరోనా బాధితుడు, దాని కోసం ఏకంగా ఆసుపత్రి నుంచి తప్పించుకున్న ఘటన సంచనలంగా మారింది.

పాన్ కోసం ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు:
అవును, త‌న‌కిష్ట‌మైన పాన్ కోసం ఓ క‌రోనా రోగి ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో శ‌నివారం(జూలై 11,2020) సాయంత్రం జరిగింది. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో అత‌న్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్ప‌త్రిలో చేర్చారు. అయితే అత‌నికి పాన్ అంటే ఇష్టం. ఆసుపత్రిలో చికిత్స కారణంగా అతడికి పాన్ తినడం సాధ్యం కాలేదు. ఈ సమయంలో పాన్ తినడం డేంజర్ కూడా. అయినా అతడి నోరు ఆగలేదు. పాన్ లేక‌పోవ‌డంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. ఇది తట్టుకోలేకపోయిన అతడు శ‌నివారం సాయంత్రం ఆస్ప‌త్రి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌ లేదు.

పాన్ తిన్నాక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు:
లాక్ డౌన్ కార‌ణంగా ఆస్ప‌త్రి ప‌రిస‌రాల్లో ఎలాంటి షాపులు తెర‌వలేదు. దీంతో ఆ క‌రోనా రోగి కొంత దూరంలో ఉన్న గాంధీ న‌గ‌ర్ వెళ్లాడు. అక్క‌డ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. పాన్ తినడమే కాదు, ముందుజాగ్రత్తగా తన జేబుల నిండా పాన్ మసాలాలు నింపుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రబుద్దుడు అక్క‌డున్న త‌న స్నేహితుడి ఇంటికెళ్లాడు. వారి కుటుంబాన్ని కలిశాడు. అయితే అతడికి కరోనా ఉన్న విషయం అతడి స్నేహితుడికి కానీ అతడి కుటుంబానికి తెలియదు. స్నేహితుడు కరోనా బాధితుడి ఇంటికి ఫోన్ చేశాడు. మీ వాడు మా ఇంట్లో ఉన్నాడని చెప్పాడు. వారు షాక్ కి గురయ్యారు. అతడికి కరోనా ఉన్న విషయం చెప్పారు. దీంతో స్నేహితుడు, అతడి కుటుంబసభ్యులు కంగుతిన్నారు. కాగా, త‌న‌ను ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించండని కరోనా బాధితుడు వారిని కోరాడు.

క్వారంటైన్ లో స్నేహితుడు, అతడి కుటుంబం:
కరోనా బాధితుడు తప్పించుకున్న విషయం ఇంతలో ఆసుపత్రి సిబ్బందికి తెలిసింది. కంగారుపడిన వారు వెంటనే అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని వారికి తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆసుపత్రి సిబ్బంది కరోనా బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తిరిగి ఐసోలేషన్ వార్డుకి తరలించారు. కాగా, అతడితో పాటు అతడి స్నేహితుడిని, అతడి కుటుంబాన్ని కూడా క్వారంటైన్ లో ఉంచారు. దీనిపై ఎస్ఎన్ మెడికల్ కాలేజీ సిబ్బంది స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నామని, రోగులపై మరింత నిఘా పెంచామని చెప్పారు.

ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు:
కాగా, పాన్ కోసం ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి మానసిక స్థితి సరిగా లేదని, కరోనా నుంచి కోలుకున్న తర్వాత మానసిక స్థితికి సంబంధించిన ట్రీట్ మెంట్ ఇస్తామని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మొత్తంగా పాన్ కోసం కరోనా రోగి ఆసుపత్రి నుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. స్తానికులను భయాందోళనకు గురి చేసింది. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే, త్యాగాలు చేయగలిగితే ప్రాణాలు దక్కుతాయి.

ట్రెండింగ్ వార్తలు