Cyclone Arnab : బంగాళాఖాతంలో ‘అర్నాబ్’ తుఫాను హెచ్చరిక.. ఏపీలో రెడ్ అలర్ట్.. ఒడిశా, బెంగాల్‌లో అతి భారీ వర్షాలు..!

Cyclone Arnab : బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడుతోంది. అది 'అర్నాబ్' తుఫానుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలపై పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Cyclone Arnab

  • తీరం దాటనున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు
  • అర్నాబ్‌గా మారనున్న అల్పపీడనం.. ఏపీలో రెడ్ అలర్ట్ జారీ
  • వణికిస్తున్న వాతావరణం.. ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాల ముప్పు
  • బుధవారం రాత్రి తీరం దాటనున్న తుఫాను.. అప్రమత్తమైన యంత్రాంగం

Cyclone Arnab : బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. పశ్చిమ-మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది కాస్త తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది.

సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 8:30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కానుంది. ఆపై గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదలనుంది.

రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత అల్పపీడనం బలపడనుంది. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి, గురువారం (సెప్టెంబర్ 24) తెల్లవారుజామున విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర అల్పపీడనంగా దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Read Also : AP Schools Holidays : వానల బీభత్సం.. ఏపీలో స్కూళ్లకు సెలవులు.. విద్యార్థుల కోసం సర్కార్ కీలక ఆదేశాలు!

ఇది తుఫానుగా బలపడితే ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంత నామకరణ జాబితా ప్రకారం దీనికి ‘అర్నాబ్’ అని పేరు పెట్టనున్నారు. బెంగాలీ భాషలో సముద్రం అని అర్థమిచ్చే ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది.

ఏపీలో రెడ్ అలర్ట్ జారీ :
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది. సెప్టెంబర్ 22-23 తేదీల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 23-24 తేదీల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం సహా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, జారే రోడ్లు, చెట్లు-విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్-నీటి సరఫరాకు అంతరాయాలు వంటివి తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జలాశయాలు, ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం కూడా ఉన్నందున రాకపోకలపై ఆంక్షలు విధించారు.

రోడ్డు-రైలు-విమాన రవాణాను నియంత్రించాలని సూచనలు జారీ అయ్యాయి. సహాయక దళాలు, విద్యుత్, నీటిపారుదల శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.