Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి!
క్రిమినల్ పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ(Dhruv Rathee) ఇంటి గేటుపై ఢిల్లీ సాకేత్ కోర్టు సమన్ల నోటీసును అంటించింది.
- V Santhosh Kumar
- Published on- October 16, 2026 / 02:22 PM IST
Delhi court pastes defamation case summons on dhruv rathee gurugram home
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయపరమైన చిక్కులు మరింత ముదిరాయి. గురుగ్రామ్లోని సెక్టార్-56 లో ఉన్న ఆయన (Dhruv Rathee)నివాసం ప్రధాన గేటుపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు జారీ చేసిన సమన్ల నోటీసులను అధికారులు శనివారం రాత్రి అంటించారు. బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు వికాస్ పాండే దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, రాఠీకి ప్రత్యక్షంగా సమన్లు అందకపోవడంతో ఇంటిపై నోటీసు అంటించాలని ఆదేశించడంతో ఈ చర్య తీసుకున్నారు.
2018 వీడియోతో రాజుకున్న పరువు నష్టం వివాదం:
ఈ వివాదం 2018లో ధ్రువ్ రాఠీ అప్లోడ్ చేసిన ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ వీడియో ఆధారంగా ప్రారంభమైంది. ఆ వీడియోలో తనపై, పార్టీ ఐటీ సెల్పై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారని వికాస్ పాండే కోర్టును ఆశ్రయించారు. తన ద్వారా మరొకరికి లంచం ఇవ్వజూపారని, ధ్రువ్ రాఠీని బద్నాం చేయడానికి రూ.50 లక్షల ఆశ చూపారని ఆ వీడియోలో అసత్య ప్రచారం చేసి తన సామాజిక ప్రతిష్టను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్టోబర్ 17న కోర్టులో తదుపరి విచారణ:
ఆస్ట్రియాలో నివసిస్తున్నందున గతంలో జారీ చేసిన నోటీసులు రాఠీకి అందలేదు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోనే ఉన్నట్లు సమాచారం రావడంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో ఆయన పాల్గొంటారనే ప్రచారం నడుస్తుండగా, ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 17న జరగనుండటంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
