Delhi High Court : మహిళను చెంపదెబ్బ కొట్టిన కేసు.. పోలీసు అధికారిపై ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం

Delhi High Court : నిరసనల సందర్భంగా మహిళా నిరసనకారిణిని చెంపదెబ్బ కొట్టిన వీడియోతో వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ సందీప్ లాంబాను విచారణ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Delhi High Court Key Verdict Woman Protester Slap Incident

Delhi High Court : నిరసనల సందర్భంగా మహిళా నిరసనకారిణిని చెంపదెబ్బ కొట్టిన వీడియోతో వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ సందీప్ లాంబాను విచారణ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఒక అధికారి తప్పు చేశాడనే ఆరోపణల ఆధారంగా విచారణ బాధ్యతలను వెంటనే తొలగించడం సమంజసం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read : Tamil Nadu : రూ.15వేలు ఇస్తామని మహిళలకు గుండు గీయించిన వ్యక్తి.. చివరిలో బిగ్ ట్విస్ట్..

జస్టిస్ గిరీష్ కాఠ్‌పాలియా విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకవేళ సంబంధిత అధికారి తప్పు చేసినట్లు చట్టపరంగా తేలితే తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని, అయితే న్యాయ విచారణ పూర్తికాకముందే ఆయనను దోషిగా భావించడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన ‘ఛలో జంతర్ మంతర్’ నిరసనలో సందీప్ లాంబా ఓ మహిళా నిరసనకారిణిని చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పర్యవేక్షణలో జరుగుతున్న పోలీసు విచారణ నిష్పక్షపాతంగా ఉండదనే అనుమానం ప్రజల్లో ఏర్పడిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అయితే ఇప్పుడు మొత్తం ఢిల్లీ పోలీసు వ్యవస్థనే అనుమానించాలా? వారు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని కూడా నిలిపివేయాలా? అంటూ ప్రశ్నించారు.

ఢిల్లీ పోలీసు తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్.. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటికే పూర్తైందని, పిటిషనర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశామని, తుది నివేదికను సంబంధిత అధికారికి పంపించామని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ ప్రయోజనం కోల్పోయిందని పేర్కొంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది, సందీప్ లాంబాపై తర్వాత జరిగిన పరిణామాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.

ఒక వీడియోలో మహిళను కొట్టినట్లు కనిపించిందనే కారణంతోనే ఆయనను అపఖ్యాతిపాలు చేయలేం. చివరికి ఆయన దోషిగా తేలినా కూడా ప్రతి కేసులోనూ పక్షపాతంగా వ్యవహరిస్తారని ముందుగానే చెప్పలేం అని జస్టిస్ కాఠ్‌పాలియా స్పష్టం చేశారు. ఈ కారణంతో విచారణను మరో అధికారికి బదిలీ చేస్తే, అది విచారణ పూర్తికాకముందే సందీప్ లాంబాను దోషిగా ప్రకటించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది.