IIT-Delhi Report : ఢిల్లీకి థర్డ్ వేవ్ ముప్పు..రోజుకి 45వేల కరోనా కేసులు!
రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.
- venkaiahnaidu
- Published On : May 30, 2021 / 07:48 PM IST
Iit Delhi Report
IIT Delhi Report రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. లాక్‌డౌన్ విధించడంతో కేసులు తగ్గి క్రమంగా నగరం కోలుకుంటోంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. థర్డ్ వేవ్ పై ఐఐటి ఢిల్లీ విడుదల చేసిన తాజా నివేదిక భయాందోళనలు కలిగించేలా ఉంది.
ఐఐటి ఢిల్లీ తాజా రిపోర్టు ప్రకారం..కరోనా థర్డ్ వేవ్‌లో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేల కొత్త కేసులు నమోదవుతాయని అంచనా. ప్రతిరోజూ సుమారు 9 వేల మంది పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీలో అటువంటి పరిస్థితి తలెత్తితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని అంచనా వేశారు.
రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని నివేదిక హెచ్చరించింది. ఈ సూచనల నేపథ్యంలో ఢిల్లీలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కేజ్రీవాల్ సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ, కేజ్రీవాల్ సర్కారు కలిసి పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ బ్లూప్రింట్‌ను ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గతంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.
