19 Wanted Terrorists : ఆగస్టు 15 వేళ ఢిల్లీలో హై అలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల.. ఎవరెవరంటే?

19 Wanted Terrorists : తీవ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో ఆగస్టు 15 సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత పెంచారు. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల చేశారు.

19 Wanted Terrorists

19 Wanted Terrorists : స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రవాద బెదిరింపుల దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

ఆగస్టు 15 సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, భద్రతా సంస్థలు భారీ స్థాయిలో నిఘా పెంచాయి. ముందు జాగ్రత్త చర్యగా
నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేశారు.

ఈ పోస్టర్లలో ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, వివిధ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలు, గుర్తింపు వివరాలను ప్రదర్శించారు. అనుమానితుల ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అధికారులు సూచించారు.

పోస్టర్లలో ఉగ్రవాదులు వీరే :
ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన రియాజ్ భత్కల్, షబాంద్రి మహ్మద్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ భత్కల్ పేర్లు ఉన్నాయి. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న మొహమ్మద్ షర్జీల్ అక్తర్, అబు సుఫియాన్, సయ్యద్ మొహమ్మద్ అర్షియాన్ కూడా పోస్టర్లలో ఉన్నారు.

Read Also : Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!

ఖలిస్థానీ ఉగ్రవాదుల్లో ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్కు చెందిన రంజిత్ సింగ్ అలియాస్ నీటా, పరమ్‌జిత్ సింగ్ పమ్మా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా ఉన్నారు. అలాగే, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధం ఉన్న హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా, వధావా సింగ్ బబ్బర్, గుర్మీత్ సింగ్ బగ్గ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

ఢిల్లీలో భారీ నిఘా :
బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాలు, కీలక ప్రభుత్వ, ఇతర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది చేపట్టే భద్రతా చర్యల్లో భాగంగానే ఈసారి కూడా ఢిల్లీ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీస్ కంట్రోల్ రూమ్ (112), స్పెషల్ సెల్ సంప్రదింపు నంబర్లను పోస్టర్లలో ఉన్నాయి. కచ్చితమైన సమాచారం అందించిన వారికి తగిన బహుమతి ఇస్తామని, వారి గుర్తింపును అత్యంత గోప్యంగా ఉంచుతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.