Delhi: క్షుద్రపూజల కలకలం.. పనిమనిషిని చంపిన డాక్టర్.. బ్యాట్ తో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా..
మనీశ్ గుప్తా(Delhi) అనే వైద్యుడు, తన ఇంట్లో గత 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న మీనా అనే మహిళను దారుణంగా హతమార్చాడు.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 02:43 PM IST
Doctor kills maid on suspicion of performing black magic rituals in delhi
- క్షుద్రపూజల అనుమానంతో పనిమనిషి దారుణ హత్య.
- క్రికెట్ బ్యాట్, కత్తితో డాక్టర్ దాడి.
- నిందితుడైన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని మౌంట్ కైలాశ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాద ఘటన వెలుగుచూసింది. వృత్తిరీత్యా డెర్మటాలజిస్టు అయిన మనీశ్ గుప్తా అనే వైద్యుడు, తన ఇంట్లో గత 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న మీనా అనే మహిళను దారుణంగా హతమార్చాడు. సదరు పనిమనిషి.. ఇంట్లో క్షుద్రపూజలు చేస్తోందని, ఆమె వల్ల కుటుంబంలో ప్రతికూల శక్తి వ్యాపిస్తోందని అతడు బలంగా అనుమానించాడు. ఈ క్రమంలో ఆమెను పనిలో నుంచి తీసేయాలని ఆయుర్వేద(Delhi) వైద్యురాలైన తన భార్యను కోరగా, అందుకు ఆమె నిరాకరించడం వివాదానికి దారితీసింది.
గతంలో మనీశ్ తల్లి క్యాన్సర్ బారిన పడినప్పుడు మీనా చేసిన సేవలను భార్య గుర్తుచేస్తూ, ఆమెను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ సమాధానంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీశ్, ఇంట్లో పనిమనిషికి ఉన్న విలువ కూడా తనకు లేదనే హీనభావనకు లోనయ్యాడు. గురువారం ఉదయం భార్య విధులకు వెళ్లిన తర్వాత, ఇంట్లో ఒంటరిగా ఉన్న మీనాతో అతడు తీవ్రస్థాయిలో గొడవకు దిగాడు. ఈ ఘర్షణ కాస్తా హద్దులు దాటడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మనీశ్, ఇంట్లోని క్రికెట్ బ్యాట్‌తో ఆమెపై బలంగా దాడి చేసి, ఆపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన డాక్టర్ మనీశ్‌ను అదుపులోకి తీసుకోగా, విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తూ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
