RNR Paddy Price: రైతన్నకు కాసుల పంట.. మళ్ళీ పెరిగిన ‘ఆర్ఎన్ఆర్ ధాన్యం’ ధర.. ఈ సీజన్లో ఇది ఆల్‌టైం రికార్డ్
ఈ-నామ్ ప్రక్రియలో క్వింటా ధాన్యానికి గరిష్ఠంగా రూ.3,236 ధర పలకడం, ఈ సీజన్లోనే ఇది ఆల్‌టైం రికార్డు స్థాయి ధర(RNR Paddy Price) కావడం విశేషం.
paddy prices hit record high in kesamudram market rnr variety touches
- భారీగా పెరిగిన ఆర్ఎన్ఆర్ ధాన్యం ధరలు
- క్వింటా గరిష్ఠ ధర రూ.3,236 దాటింది.
- సగటు ధర రూ.2,721కి చేరింది.
RNR Paddy Price: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం ధరలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఈ-నామ్ (ఈ-వేలం) ప్రక్రియలో క్వింటా ధాన్యానికి గరిష్ఠంగా రూ.3,236 ధర పలికింది. ఈ సీజన్లోనే ఇది ఆల్‌టైం రికార్డు స్థాయి ధర కావడం విశేషం. మార్కెట్‌కు మొత్తం 27 మంది రైతులు 643 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, ఈ అసాధారణ ధర నమోదైంది.
ముఖ్యంగా స్టేషన్ కిష్టాపురానికి చెందిన మహిళా రైతు ఆగె మోహనమ్మ తీసుకువచ్చిన ఆరు బస్తాల ధాన్యానికి ఈ అత్యధిక ధర లభించింది. ఒకే రైతుకు ఈ గరిష్ఠ ధర దక్కినప్పటికీ, మార్కెట్లో ధాన్యం(RNR Paddy Price) ధర రూ.3 వేల మార్కును దాటడం మిగిలిన రైతుల్లో కూడా కొత్త ఆశలను రేకెత్తించింది. కనిష్ఠ ధర క్వింటాకు రూ.1,889గా నమోదైంది.
ధరల పెరుగుదల ధోరణి సగటు ధరల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం నాటి సగటు ధర రూ.2,589తో పోలిస్తే, గురువారం నాటికి అది రూ.2,721కి పెరిగింది. రోజురోజుకూ సగటు ధరలు మెరుగుపడుతుండటంతో ఆర్ఎన్ఆర్ ధాన్యం పండించిన రైతులకు మంచి లాభాలు అందుతున్నాయి.
