Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగుసహా.. దేశంలో 24 స్థానాలకు.. ఫుల్ షెడ్యూల్ ఇక్కడ..
Rajya Sabha polls : దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా.. అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
- Harish Thanniru
- Updated on- May 22, 2026 / 10:45 AM IST
Rajya Sabha polls
Rajya Sabha polls : దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా.. అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలకు సంబంధించి జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8వ తేదీ నాటికి చివరి తేదీకాగా.. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వరకు గడువు ఉంటుందని ఈసీ ప్రకటించింది. పోలింగ్ 18న జరగనుండగా.. అదేరోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూన్ 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఈసీ తెలిపింది.
ఎన్నికలు జరిగే స్థానాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు స్థానాలకు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఎన్నికల సంఘం నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 21వ తేదీతో ఆళ్ల అయోధ్య రాంరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల పదవీకాలం పూర్తికానుంది. అధికార కూటమికే నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ మేరకు చర్చలు పూర్తయినట్లు సమాచారం.
