Trump, Modi (Image Credit To Original Source)
India-US Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో భారత్ కొన్ని అంశాలకు ఒప్పుకోలేదన్న విషయం తెలిసిందే. భారత వ్యవసాయ రంగంలోని పాడి పరిశ్రమ, సోయాబీన్ వంటి సున్నితమైన వాటిల్లో అమెరికా ఉత్పత్తులు అపరిమితంగా ప్రవేశిస్తే మన రైతులకు నష్టమని భారత్ ముందుగా ఒప్పందానికి నిరాకరించింది.
ఈ రంగాలు రాజకీయంగా సున్నితమైనవి. లక్షలాది మంది చిన్నకారు రైతులకు చాలా ముఖ్యం. అందుకే పాడి పరిశ్రమ, సోయాబీన్ వంటి వాటిల్లోనూ అమెరికా ఉత్పత్తులకు ప్రవేశం కల్పించాలన్న అమెరికా డిమాండ్‌ను భారత్ ఒప్పుకోలేదు.
అయితే, ఇప్పుడు వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం, థ్యాంక్యూ చెబుతూ భారత్ ప్రధాని మోదీ ట్వీట్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్ర సర్కారు వెనక్కి తగ్గిందా? అందుకే అమెరికా ఈ ఒప్పందానికి అంగీకరించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, వెనెజువెలా నుంచి కూడా భారత్ చమురు కొంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ వర్గాలు ఏమన్నాయి?
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు పలు విషయాలు తెలిపాయి. ఈ ఒప్పందం భారత రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించదని అన్నాయి. రైతుల ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశాయి.
Also Read: లోక్‌సభలో ఓ తెలంగాణ ఎంపీ సహా 8 మంది సభ్యులపై సస్పెన్షన్.. ఎందుకంటే?
భారత వ్యవసాయ రంగంలో అమెరికా ఉత్పత్తులు విస్తృతంగా ప్రవేశించాలని యూఎస్ చేస్తున్న ప్రతిపాదనలను కేంద్ర సర్కారు తిరస్కరించడం వల్ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముందుకు కదలలేదు. ఇదే ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న అంశంగా నిలిచింది.
సోయాబీన్, పాడి రంగాల వంటి వ్యవసాయ విభాగాల్లో అమెరికా డిమాండ్లను భారత్ ఒప్పుకోలేదు. ఆయా రంగాల ప్రయోజనాలను రక్షిస్తూనే ఉంటామని ప్రభుత్వ వర్గాలు ఇవాళ జాతీయ మీడియాకు తెలిపాయి.
ఇటీవల యురోపియన్ యూనియన్ (ఈయూ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ప్రవేశం ఇచ్చింది. అంటే ఈయూ ఉత్పత్తులను భారత మార్కెట్లో అమ్ముకునే అనుమతిని ఇచ్చింది.
మరి చమురు వాణిజ్యం?
వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు వాణిజ్యాన్ని నిలిపేయడం, సుంకాలు, పన్నులు కాకుండా వాణిజ్యాన్ని పరిమితం చేసే నిబంధనలు “0”కు తగ్గించడం, శక్తి, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు సహా అమెరికా సరుకులు $500 బిలియన్లకు పైగా కొనుగోలు చేయడం వంటి వాటికి ఇండియా అంగీకరించిందని ట్రంప్ చెప్పారు.
ఆంక్షలులేని ప్రపంచ దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయా దేశాల్లో ఉన్న ధరను బట్టి కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాయి. వెనెజువెలా చమురును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పాయి.
“ఆంక్షలు ఉన్న సమయంలో వెనెజువెలా నుంచి మేము కొనలేదు. ఇప్పుడు ఆంక్షలను తొలగించారు. కొనుగోలు చేస్తాం” అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
జనవరి-నవంబర్ కాలంలో అమెరికాకు భారత ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 15.88 శాతం పెరిగి $85.5 బిలియన్లకు చేరాయి. దిగుమతులు $46.08 బిలియన్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలిసింది.