Vande Mataram : వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ఇక జైలు.. కేంద్రం కీలక బిల్లు!
Vande Mataram : భారత జాతీయ గీతం జనగణమన కు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన రక్షణను దేశ జాతీయ గేయం వందే మాతరం కు కూడా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vande Mataram : భారత జాతీయ గీతం జనగణమన కు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన రక్షణను దేశ జాతీయ గేయం వందే మాతరం కు కూడా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ (సవరణ)-2026’ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 1971 నాటి “ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ చట్టం”లో సవరణలు అమల్లోకి వస్తాయి.
Also Read : Ration: గుడ్ న్యూస్.. 3 నెలల రేషన్ ఒకేసారి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏం మారబోతోంది?
ప్రస్తుతం 1971 చట్టం ప్రకారం జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతం “జనగణమన”ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా జాతీయ గీతం ఆలాపనను అడ్డుకోవడం నేరంగా పరిగణిస్తారు. కొత్త సవరణ ద్వారా “వందే మాతరం”ను కూడా అదే చట్టం పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో జాతీయ గేయానికి కూడా జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
ఈ బిల్లును ఎందుకు తీసుకొస్తోంది?
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరంకు ప్రత్యేక స్థానం ఉందని, ఇది దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అందుకే జాతీయ పతాకం, జాతీయ గీతానికి ఉన్నట్టే జాతీయ గేయానికీ చట్టపరమైన రక్షణ కల్పించాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ గీతం, వందే మాతరం, రాష్ట్ర గీతాలు, విదేశీ జాతీయ గీతాల ఆలాపనపై అధికారిక కార్యక్రమాలకోసం మార్గదర్శకాలుకూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు అమలు చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
వందే మాతరం విశిష్టత..
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన “ఆనందమఠం” నవలలో తొలిసారిగా వందే మాతరం చోటుచేసుకుంది. అనంతరం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గేయం ప్రజల్లో దేశభక్తిని రగిలించిన నినాదంగా మారింది. భారత జాతీయ గీతం జనగణమన కాగా, వందే మాతరంకు జాతీయ గేయం హోదా ఉంది. ఇందులోని తొలి రెండు చరణాలనే అధికారికంగా గుర్తించి ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో ఆలపిస్తుంటారు.
ఈ ఏడాది వందే మాతరం చారిత్రక వారసత్వానికి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. దీంతో గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సవరణ బిల్లుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాతే చట్టంగా అమల్లోకి వస్తుంది. అమలులోకి వస్తే వందే మాతరాన్ని అవమానించడం లేదంటే దాని ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం శిక్షార్హ నేరంగా మారుతుంది.
