Banks Open Sunday: ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్రం, ఆర్బీఐ కీలక నిర్ణయం
ఈ ఆదివారం నాడు కూడా బ్యాంకింగ్(Banks Open Sunday) కార్యకలాపాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Banks Open on sunday march 27 rbi finance ministry decision ahead of 3 day bank strike
Banks Open Sunday: వారంలో ఐదు రోజుల పనిదినాల అమలు, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంపై ఏర్పడిన అసంతృప్తి కారణంగా బ్యాంకింగ్ యూనియన్లు వరుసగా మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 28 నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మె జరగనుండటం, అంతకు ముందు నాలుగో శనివారం సెలవు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సాధారణ ప్రజలు, వ్యాపారులకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చూసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అత్యవసర నిర్ణయాన్ని తీసుకున్నాయి.
ఈ నెల 27న ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు:
సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు గాను సాధారణ సెలవు దినమైన ఈ నెల 27వ తేదీ ఆదివారం నాడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆర్బీఐ కూడా ఇందుకు అనుమతి(Banks Open Sunday) ఇవ్వడంతో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) ఆదివారం రోజున సాధారణ వేళల్లో పనిచేయనున్నాయి. ఈ నిర్ణయంతో డిపాజిట్లు, విత్డ్రాయల్స్, ఇతర అత్యవసర శాఖా లావాదేవీలు చేసుకునే వినియోగదారులకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.
వినియోగదారులకు ఎస్బీఐ సహా పలు బ్యాంకు కీలక సూచనలు:
నేరుగా బ్యాంక్ శాఖలకు వచ్చి చేసే సేవలకు సమ్మె వల్ల అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. డిజిటల్ సేవలైన యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, ఏటీఎం (ATM) సేవలు అంతరాయం లేకుండా యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశాయి. బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీల కోసం వినియోగదారులు డిజిటల్ మార్గాలనే వినియోగించుకోవాలని కోరాయి.
