Ration: గుడ్ న్యూస్.. 3 నెలల రేషన్ ఒకేసారి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు 3 నెలల రేషన్(Ration) బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Central Government decided to distribute three months ration at once
- మూడు నెలల ఉచిత రేషన్
- ఆగస్టు ఒకటి నుండి పంపిణీ
- మూడుసార్లు వేలిముద్రలు వేయాలి
Ration: దేశంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఊరటనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా సవాళ్లను అధిగమించి, నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు 3 నెలల రేషన్(Ration) బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026 నెలలకు సంబంధించిన రేషన్‌ను ఏకకాలంలో ఉచితంగా పొందనున్నారు.
ఆగస్టు 1 నుండి పంపిణీ షురూ.. పూర్తి ఉచితంగా సరుకులు:
ఈ ప్రత్యేక డ్రైవ్ జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద పూర్తిగా ఉచితంగా అమలు కానుంది. ఆగస్టు 1వ తేదీ నుండి లబ్ధిదారులకు ఈ మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేస్తారు. గతంలో సాధారణంగా నెలలో మొదటి 15 రోజులు మాత్రమే రేషన్ దుకాణాలు తెరిచేవారు. కానీ ఈసారి భారీ మొత్తంలో పంపిణీ చేయాల్సి ఉన్నందున, ఆగస్టు నెల మొత్తం 31 రోజుల పాటు దుకాణాలు తెరిచి ఉంచనున్నారు. లబ్ధిదారులు తమ కోటాను పొందేందుకు బయోమెట్రిక్ విధానంలో మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది.
దుకాణాల సామర్థ్యం ఆధారంగా రవాణా ఏర్పాట్లు:
ఈ భారీ పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు అధికారులు నిల్వ, రవాణా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎంఎల్ఎస్ (MLS) పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. చిన్న దుకాణాలకు ఒకే విడతలో, ఎక్కువ కార్డులు ఉన్న పెద్ద దుకాణాలకు వారి నిల్వ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు విడతల్లో బియ్యాన్ని రవాణా చేస్తారు. గతంలో సైతం ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్‌ను ఇలాగే ఒకేసారి విజయవంతంగా పంపిణీ చేసిన అనుభవంతో అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
