Farooq Abdullah : ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. 20ఏళ్ల నాటి పగ.. నిందితుడి సంచలన వాంగ్మూలం.. వీడియో వైరల్

Assassination Attempt On Farooq Abdullah : జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది.

Farooq Abdullah

  • జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
  • వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఘటన
  • వెనుక నుంచి దగ్గరగా వచ్చి గన్‌ గురిపెట్టిన నిందితుడు
  • భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
  • విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడి

Assassination Attempt On Farooq Abdullah : జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫరూక్ అబ్దుల్లా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.

Also Read : Firewood blower Stove : గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి.. గ్యాస్ ఇబ్బందులకు చెక్..!

జమ్మూ శివార్లలోని హోటల్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరీ కూడా ఉన్నారు. వారంతా వివాహ వేడుక హాల్ లోకి ఎంటర్ అయిన సమయంలో ఓ వ్యక్తి వెనుకాల నుంచి వచ్చి ఫరూక్ పై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో కాల్చేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది, పక్కనే ఉన్నవారు నిందితుడ్ని పక్కకు నెట్టేశారు. దీంతో ఫరూక్ అబ్దుల్లా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంటనే నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

20ఏళ్ల నాటి పగ..
ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నంకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జమ్మూకి చెందిన 63ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. గత 20ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ఎదురు చూస్తున్నట్లుగా నిందితుడు పోలీసులతో చెప్పాడు. ఇది తన వ్యక్తిగత అజెండా అని, దీని వెనుక ఎలాంటి సంస్థల హస్తం లేదని పేర్కొన్నాడు. కాల్పులకు యత్నించిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని, ఆ తుపాకీకి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు ధృవీకరించారు.

సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..
ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం ఘటన విషయం తెలుసుకున్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ లోడ్ చేసిన తుపాకీతో ఒక వ్యక్తి అంత దగ్గరకు ఎలా రాగలిగాడంటూ ఆయన ప్రశ్నించారు. ఇది భద్రతా వైఫల్యమేనని స్పష్టంగా అర్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా హోటల్ వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు. అయితే, నిందితుడిని నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫరూక్ అబ్దుల్లాపై అంతటి పగ ఎందుకు పెరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.