Captain Smit Machchhar : రక్తమోడుతున్నా ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్? ట్రంప్, మోదీ ప్రశంసల జల్లు..

Captain Smit Machchhar : ఫ్లైదుబాయ్‌ విమానం FZ1073లో జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి విమాన ప్రమాదం జరగకుండా కాపాడటం పట్ల ట్రంప్, మోదీ, నెతన్యాహు సహా పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన్ను ఓ హీరోగా అభివర్ణించారు.

Captain Smit Machchhar

Captain Smit Machchhar : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ప్లై దుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానం గాల్లో ఉండగానే ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విమానం కిందికి దూసుకెళ్లింది.. దీంతో ప్రయాణికులు కేకలు పెడుతూ భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్ర గాయాలతో రక్తమోడుతున్నా చాకచక్యంగా వ్యవహరించి విమాన ప్రమాదం బారిన పడకుండా కాపాడాడు.

Also Read : LPG Cylinder Price : పండుగల వేళ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్.. ధరలు పైపైకి.. ఏపీ, తెలంగాణలో కొత్త రేటు ఇదే!

అసలేం జరిగింది..
బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) దుబాయ్ – టెల్‌అవీన్ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య వివాదం తీవ్రంగా మారడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పై కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత విమానం ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. ఎత్తను కోల్పోయి.. వేగంగా కిందికి దూసుకెళ్లింది. ప్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం 30 సెకన్లలో దాదాపు 14వేల అడుగుల మేర కిందకు పడిపోయింది. ఈలోపు కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొద్ది సెకన్లలోనే గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిపోయాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి మచ్చర్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకొని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్ కు విమానాన్ని మళ్లించారు. అక్కడ విమానంను సురక్షితంగా ల్యాండ్ చేశారు.

చికిత్స పొందుతున్న కెప్టెన్ మచ్చర్..
కో-పైలెట్ దాడిలో గాయపడిన స్మిత్ మచ్చర్ తీవ్ర గాయాలతో సౌదీ అరేబియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మచ్చర్ కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వారికి తెలియజేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ.. దాడి చేసిన కో-పైలట్‌ బహుశా ఉగ్రవాది లేదా మతిస్థిమితం లేనివాడై ఉంటాడు. అందుకే ఇంత దారుణంగా కత్తితో దాడి చేశాడని ట్రంప్‌ అన్నారు.

రియల్ హీరో.. ట్రంప్, నెతన్యాహు, మోదీ ప్రశంసలు..
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన తెగువ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ప్రశంసించారు. ఆయనను హీరోగా అభివర్ణిస్తూ దేశం మొత్తం స్మిత్ ను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్మిత్ మచ్చర్ పై ప్రశంసలు కురిపించారు. అతడిని హీరోగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఈ ఘటనపై మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. స్మిత్ తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోసం కేకలు వేయడం వల్ల ప్రయాణికులు లోపలికి వెళ్లే అవకాశం లభించిందని ట్రంప్ వివరించారు. పైలట్ త్వరగా కోలుకోవాలని, ఆయన అంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తలుపు తెరిచిన ఆయనకు సమయస్ఫూర్తి ప్రశంసనీయమని.. ఆయన రియల్ హీరో అంటూ ట్రంప్ కొనియాడారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్‌ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎవరీ స్మిత్ మచ్చర్‌?
ముంబైకి చెందిన స్మిత్ మచ్ఛర్ భారతీయ పైలట్. ఆయనకు బోయింగ్ 737 విమానాలపై విస్తృత అనుభవం ఉంది. 2011లో స్పైస్‌జెట్‌లో తన కెరీర్ ప్రారంభించిన ఆయన అక్కడ సుమారు 11 సంవత్సరాలు పనిచేశారు. సీనియర్ కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2022లో ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన ప్రొఫైల్ ప్రకారం మొత్తం సుమారు 9,750 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉంది. ఆయన సోదరుడు కూడా ఇటీవల ప్లై దుబాయ్ లో చేరినట్లు సమాచారం.