FSSAI Report : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై నిషేదం.. FSSAI సంచలన నివేదిక

FSSAI Bans Popular Whiskies Rums : మద్యం మార్కెట్‌లో దశాబ్దాలుగా విశేష ప్రజాదరణ పొందిన పలు ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) భారీ షాక్ ఇచ్చింది.

FSSAI Report

FSSAI Bans Popular Whiskies Rums : మీరు తాగే ప్రముఖ విస్కీ, రమ్ నిజంగా సంవత్సరాల పాటు బారెల్‌లలో నిల్వ చేసి తయారు చేసిందేనా? లేదంటే ప్రయోగశాలలో తయారు చేసిన ప్లేవర్లతో అదే రుచి, వాసనను సృష్టించారా? ఈ అంశంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read :  Andhra Pradesh : ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ప్రకారం.. మద్యం మార్కెట్‌లో దశాబ్దాలుగా విశేష ప్రజాదరణ పొందిన పలు ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లలో నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో పాటు కృత్రిమ సువాసనలు (ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు) వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేబులింగ్ విధానాలను పాటిస్తున్నట్లు తేలింది. దీంతో సంవత్సరాలుగా నిల్వ చేసిన మద్యం అంటూ లొట్టలేసుకొని తాగే మందుబాబులకు తాజా నివేదిక షాకిచ్చినట్లయింది.

రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటి బ్లూ, బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీలతోపాటు ఓల్డ్ మాంక్, మెక్‌డొవెల్స్ నంబర్-1, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్ వేరియంట్లలో సహజ సిద్ధమైన ఏజింగ్ (మ్యూచ్యురేషన్) ప్రక్రియకు స్వస్తి చెప్పి కృత్రిమ లేదా నేచర్ ఐడెంటికల్ ప్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ ప్రముఖ మద్యం తయారీ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంటూ చర్యలు ప్రారంభించింది.

సాధారణంగా మొలాసెస్ లేదా మాల్ట్ వంటి ప్రాథమిక పాదార్థాలను పులియబెట్టి ఈస్ట్ చర్య ద్వారా సహజ రుచి, సువాసన వచ్చేలా తయారు చేస్తారు. కానీ, వాటికి బదులుగా విస్కీలో విస్కీ ప్లేవర్, రమ్‌లో రమ్ ఫేవర్‌లను కలపడం అంతర్జాతీయ తయారీ ప్రమాణాలకు విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. కాఫీ, వెనిలా వంటి ఇతర రుచులను జోడించడానికి అనుమతి ఉన్నప్పటికీ మద్యం అసలు నమూనానే కృత్రిమంగా సృష్టించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో ఇండియా), ఇన్‌బ్రూ బెవరేజెస్ తదితర సంస్థలకు చెందిన కొన్ని ఉత్పత్తుల విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు విధించింది.

ఇదిలాఉంటే.. లేబలింగ్ పై మద్యం తయారీ తేదీ ప్రకటనలకు సంబంధించి కూడా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు తేలిసింది. ఈ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఉత్పత్తులను కేవలం విస్కీ లేదా రమ్ అని కాకుండా బాటిల్ ముందు భాగంలో స్పష్టంగా ‘విస్కీ-ఫ్లేవర్డ్ స్పిరిట్’ లేదా ‘రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్’ అని ముద్రించాలని నిబంధన విధించింది. నిబంధనలు పాటించని తయారీ యూనిట్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ చర్యలు తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.