Gig Workers Strike
Gig Workers Strike : గిగ్ వర్కర్లు సమ్మెబాట పట్టారు. న్యూఇయర్ వేళ దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సేవలు బంద్ కానున్నాయి.
న్యూఇయర్ వేళ..
కొత్త సంవత్సరం వేడుకల వేళ ఆన్‌లైన్‌లో ఫుడ్ లేదా గ్రాసరీస్ ఆర్డర్ చేసే వారికి ఇది చేదు వార్తే. జెప్టో, బ్లింకిట్ సహా స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొనున్నారు. గిగ్ వర్కర్లు ఈ దేశవ్యాప్త సమ్మెకు దిగడంతో.. ఈ యాప్ బంద్ కారణంగా లక్షలాది డెలివరీలు నిలిచిపోయి అనేక మంది కస్టమర్లతోపాటు.. రెస్టారెంట్లు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
Gig Workers Strike
సమ్మెకు కారణం ఏమిటి..?
బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు కస్టమర్లు ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే, అలా కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధన గిగ్ వర్కర్ల ప్రాణాలకు ముప్పుగా మారిందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎంత దూరం ఉన్నా 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే టార్గెట్ విధించడం, వర్కర్ల ఐడీలు బ్లాక్ చేయడం వంటి సమస్యలు ఉన్నాయని వర్కర్లు చెబుతున్నారు. కష్టపడినా అందుకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని వాపోతున్నారు. కంపెనీల నుంచి వర్కర్లకు ఎదురవుతున్న సమస్యలు, పని ఒత్తిడి, వేధింపులతో ఆందోళనకు దిగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలపై వెంటనే స్పందించాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
హోటళ్లు, కస్టమర్లకు ఇబ్బందే..
గిగ్ వర్కర్లు ఎక్కువగా పనిచేస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే.. ఈనెల 25న ప్లాష్ స్ట్రైక్ పేరుతో సమ్మె చేసిన గిగ్ వర్కర్లు.. దానికి కొనసాగింపుగా బుధవారం మెరుపు సమ్మెకు దిగుతున్నారు. ఈనెల 25న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు పాల్గొన్నారు. దీంతో ప్రధాన నగరాల్లో 60శాతం డెలివరీలు ఆలస్యం అయ్యాయి. దీంతో కంపెనీలపై సోషల్ మీడియాలో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ లో స్విగ్గీ షేర్ 2శాతం పడిపోయింది.
అయితే, ఇవాళ జరిగే దేశవ్యాప్త సమ్మెలో లక్షల మంది గిగ్ వర్కర్లు పాల్గోనున్నారు. దీంతో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకు డెలివరీలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా న్యూఇయర్ వేడుకల కోసం లక్షలాది మంది ఆన్ లైన్ ఆర్డర్లపై ఆధారపడతారు. సమ్మె ప్రభావం ఉంటే హోటల్ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది.