అంత్యక్రియలకు వెళ్లి.. పెరుగుతో చేసిన రైతాను తాగిన గ్రామస్థులు.. ఆ తర్వాత 200 మంది భయంతో వణికిపోతూ..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బదాయూన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకుంది.

అంత్యక్రియలకు వెళ్లి.. పెరుగుతో చేసిన రైతాను తాగిన గ్రామస్థులు.. ఆ తర్వాత 200 మంది భయంతో వణికిపోతూ..

Updated On : December 30, 2025 / 3:23 PM IST

Uttar Pradesh: ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందితే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. గ్రామంలోని వారికి భోజనాలు పెట్టారు. పెరుగుతో తయారు చేసే రైతాను కూడా ఇచ్చారు. అయితే, ఆ పెరుగు తయారు కావడానికి పాలు ఇచ్చిన గేదె రేబిస్‌ లక్షణాలతో మృతి చెందింది. దీంతో తమకు కూడా రేబిస్‌ వచ్చే ప్రమాదం ఉందన్న భయంతో దాదాపు 200 మంది రేబీస్ టీకా తీసుకున్నారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బదాయూన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారందరికీ రేబీస్ టీకా ఇచ్చినట్లు ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఎవరూ అనారోగ్యానికి గురి కాలేదని అన్నారు.

దీనిపై పిప్రౌలి గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. హాజరైన వారికి రైతా వడ్డించారు. కొన్ని రోజుల తర్వాత ఓ గేదె మృతి చెందింది. అంతకు ముందు ఆ గేదెను ఓ కుక్క కరిచింది.

అంత్యక్రియలకు హాజరైన వారికి ఇచ్చిన రైతా తయారీకి పాలను ఈ గేదె ఇచ్చిందేనని తెలుసుకున్నారు. దీంతో గ్రామస్థులు భయపడ్డారు. వారు ఆరోగ్య అధికారులను సంప్రదించారు. వారికి ఉజ్జానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య సిబ్బంది యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు ఇచ్చారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్వర్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే అధికారులు వేగంగా స్పందించారని చెప్పారు.

కుక్క కాటు తర్వాత ఆ గేదెలో రేబీస్‌కు సంబంధించిన లక్షణాలు కనపడ్డాయని అన్నారు. ఆ తర్వాత గేదె మృతి చెందిందని వివరించారు.

“నివారణే ఉత్తమ చికిత్స. రేబిస్ సోకుతుందేమోనని అనుమానపడ్డ ప్రతి ఒక్కరికీ యాంటీ రేబీస్ టీకా ఇచ్చాం. సాధారణంగా పాలను మరిగించిన తర్వాత తాగితే రేబీస్ సోకే ప్రమాదం ఉండదు. అయినప్పటికీ టీకాలు వేశాం” అని చెప్పారు. పిప్రౌలి గ్రామంలో ఎలాంటి వ్యాధి వ్యాప్తి లేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని తెలిపింది.