Unnao Rape Case : ఉన్నావ్ అత్యాచార కేసు.. సెంగార్‌కు బిగ్ షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ..
Unnao Rape Case : ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత
Unnao Rape Case
Unnao Rape Case : ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జైలు శిక్షణను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను బాధితురాలి తరపు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. ఈ అప్పీల్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యాకాంత్, న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ కేసులో జీవిత ఖైదు పడిన నిందితుడు సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. బాధితురాలికి న్యాయ సహాయం కూడా అందించాలని ఆదేశించింది. అంతేకాక.. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ సెంగర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేను చాలా సంతోషంగా ఉన్నాను.. : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
సుప్రీంకోర్టు తీర్పును ఉన్నావ్ అత్యాచార బాధితురాలు స్వాగతించింది. ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉంది. అతనికి మరణ శిక్ష పడేలా నేను చూస్తాను’’ అంటూ బాధితురాలు పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. నా కుటుంబానికి భద్రత అవసరం. మా న్యాయవాదులకు భద్రత అవసరం. మా అందరికీ భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
ఏమిటీ కేసు..
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే, ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయకపోవటంతో అప్పట్లో బాధితురాలు సీఎం యోగి ఆధిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు హైప్రొఫైల్ కేసుగా మారింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. బాధితురాలు యాక్సిడెంట్ కు గురైంది. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదయ్యాయి.
ఉన్నావ్ అత్యాచార కేసు 2018లో సీబీఐ చేతికి వెళ్లింది. 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. 2019 డిసెంబర్ లో దోషిగా తేలడంతో సెంగార్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సెంగర్ శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సెంగార్ కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఈ తీర్పుపై బాధితురాలి తరపు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా.. సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపి.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
