Donkey Farming: గాడిదలు పెంచితే రూ.50 లక్షలు.. కేంద్రం సరికొత్త స్కీమ్.. అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచడం, దేశీయ జాతులను పరిరక్షించడమే ఈ పథకం లక్ష్యం.

  • Published On : March 19, 2026 / 11:46 PM IST

Representative Image (Image Credit To Original Source)

 

Donkey Farming: దేశంలో గాడిదల సంఖ్య బాగా తగ్గిపోయింది. గాడిదల సంఖ్య ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఇలానే వదిలేస్తే అవి అంతరించిపోయే ప్రమాదమూ ఉంది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. దేశంలో క్షీణిస్తున్న గాడిదల సంఖ్యను పెంచేలా గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్కీమ్ ప్రకటించింది. గాడిదల పెంపకానికి రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాతీయ పశు సంపద మిషన్ కింద ఈ చొరవ తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచడం, దేశీయ జాతులను పరిరక్షించడమే ఈ పథకం లక్ష్యం.

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్రం. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం వరకు సబ్సిడీని గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు అందిస్తుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద పశు సంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం.. ఈ పథకానికి సబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.

అర్హులు వీరే..

ఈ పథకానికి కొన్ని అర్హతలు, షరతులు ఉన్నాయి. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్ని గాడిదలు పెంచాలి?

గాడిదల పెంపకం యూనిట్ ఏర్పాటుకు కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు కచ్చితంగా ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.

రెండు విడతల్లో సబ్సిడీ విడుదల..

సబ్సిడీని ప్రభుత్వం రెండు విడతల్లో రిలీజ్ చేస్తుంది. ప్రాజెక్ట్ కు బ్యాంక్ లోన్ ఆమోదం తర్వాత మొదటి విడత రాయితీ వస్తుంది. గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీ విడుదల చేస్తారు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. 2019లో జరిగిన పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలే ఉన్నాయి. 2012తో పోలిస్తే దాదాపు 60 శాతం తగ్గింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, నిర్మాణ పనుల్లో గాడిదలను బాగా వాడేవారు. తర్వాత యంత్రాల వినియోగం పెరగడంతో వీటి అవసరం గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలియజేసింది.

ఇటీవలి కాలంలో గాడిదల పెంపకంపై యువత ఆసక్తి కనబరుస్తోంది. గాడిదల పెంపకంతో కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు గాడిదల పెంపకం పశుసంవర్ధక వ్యాపారంగా మారుతుంది. రవాణ, నిర్మాణ పనులలో సాంప్రదాయ ఉపయోగాలతో పాటు గాడిదల పెంపకాన్ని ఇప్పుడు అనేక దేశాలలో ఒక ప్రత్యేకమైన పశుసంపద వ్యాపారంగా చూస్తున్నారు. పారిశ్రామికవేత్తలు సంతానోత్పత్తికి ఉపయోగించే జంతువులను అమ్మడం ద్వారా, గ్రామీణ పరిశ్రమలకు పని చేసే గాడిదలను సరఫరా చేయడం ద్వారా, లేదా కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియం ఉత్పత్తిగా పరిగణించబడే గాడిద పాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించొచ్చు.

గాడిద పాలలో చర్మ సంరక్షణకు మేలు చేసే పోషకాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే దీనిని ప్రత్యేక ఆరోగ్య ఉత్పత్తులు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఒక గాడిద ప్రతిరోజూ చాలా తక్కువ పరిమాణంలో పాలను ఇస్తుంది. దీంతో గాడిద పాలు ప్రత్యేక మార్కెట్లలో అధిక ధరలకు అమ్ముడవుతుంది. గాడిదల పెంపకం చిన్న తరహా పశుసంపద వ్యాపారాలకు ఒక అభివృద్ధి చెందుతున్న అవకాశంగా మారుతోంది.

ప్రపంచవ్యాప్త డిమాండ్, ఎగుమతి విలువ..

ప్రపంచవ్యాప్తంగా గాడిదల పెంపకంపై ఆసక్తిని పెంచుతున్న మరో అంశం సాంప్రదాయ చైనీస్ వైద్యంలో విస్తృతంగా ఉపయోగించే ‘ఎజియావో’ అనే జెలటిన్ ఉత్పత్తి తయారీకి వాడే గాడిద చర్మాలకు ఉన్న డిమాండ్. ఈ ఉత్పత్తిని గాడిద చర్మాలను శుద్ధి చేసి తయారు చేస్తారు. దీనిని అనేక ఆసియా మార్కెట్లలో ఆరోగ్య సప్లిమెంట్‌గా అమ్ముతారు. పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొన్ని దేశాలు గాడిదల పెంపక క్షేత్రాలను, గాడిద ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతుల కోసం వెతికాయి. గాడిదల పెంపకం ద్వారా దేశీయ గాడిద జాతుల సంరక్షణ, రైతులు ప్రత్యేక మార్కెట్లను అందిపుచ్చుకోవడానికి సహాయపడటంతో పాటు దేశంలో క్షీణిస్తున్న గాడిదల జనాభాను కూడా కాపాడగలవని నిపుణులు అంటున్నారు.

రైతుల కోసం ఇతర పశుసంపద పథకాలు..
పశుసంపద రైతులకు మద్దతివ్వడానికి ప్రభుత్వం అనేక ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అలాంటి పథకాలలో ఒకటి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్. దీని ద్వారా చిన్న పశుసంపద రైతులు ఎటువంటి హామీ లేకుండా రూ. 1.6 లక్షల వరకు రుణాలు పొందొచ్చు. ఈ రుణాలు తరచుగా రాయితీ వడ్డీ రేట్లకు అందుబాటులో ఉంటాయి.

మరొక కార్యక్రమం రాష్ట్రీయ గోకుల్ మిషన్.. ఇది దేశీయ ఆవులు, గేదెల జాతులను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం పెంపక కేంద్రాలకు మద్దతిస్తుంది. కృతిమ గర్భధారణ వంటి సేవలను అందిస్తుంది.

ఈ కార్యక్రమాలన్నింటి లక్ష్యం ఒక్కటే. భారతదేశం అంతటా గ్రామీణ ఆదాయాలను పెంచడం, పశుసంపద ఉత్పాదకతను బలోపేతం చేయడం, దేశీయ జంతు జాతులను పరిరక్షించడమే.

Also Read: గ్యాస్ సంక్షోభం మరింత పెరగబోతుందా..? ఖతార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి..