UP Girl Ragini : ఊతకర్ర లేదు.. వీల్‌చైర్ లేదు.. ఒంటికాలితో 400 మీటర్లు.. కంటతడి పెట్టించే ఏడేళ్ల రాగిణి కథ.. చదువుపై ఆమె తపనకు సెల్యూట్!

UP Girl Ragini : యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

UP Girl Ragini

UP Girl Ragini : విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also Read : AP Govt : నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే ఉపాధి అవకాశం.. వీరు మాత్రమే అర్హులు

ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!
యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది.

రోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..
ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ “నాకే ఎందుకీ శిక్ష దేవుడా” అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్ చలించిపోయారు. చిన్నారికి కృత్రిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్) లేదంటే ట్రైసైకిల్ ఇప్పించాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించడంతో ఈ విషాదకర దృశ్యం కాస్తా వైరల్ గా మారింది.

కదిలిన యంత్రాంగం.. అండగా నిలిచిన ఉదారులు!
రాగిణి కష్టం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో అధికారులు, పలువురు నాయకులు తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బల్లియా జిల్లా కలెక్టర్ మంగ్లా ప్రసాద్ సింగ్ స్పందించి.. దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, వైద్యుల బృందాన్ని చిన్నారి ఇంటికి పంపించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు రాగిణి నివాసానికి చేరుకుని, చిన్నారికి తక్షణ సహాయంగా ఒక వీల్‌చైర్‌తో పాటు రూ. 25,000 ఆర్థిక సాయాన్ని అందించారు. త్వరలోనే చిన్నారికి కృత్రిమ కాలు కూడా అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చదువుకోసం ఆ పసిపాప పడుతున్న తపనకు తగిన సాయం అందుతుండటంతో రాగిణి ముఖంలో మళ్లీ చిరునవ్వులు వికసిస్తున్నాయి.