Bengaluru Rain: నేలకూలిన చెట్లు, వాహనాలు ధ్వంసం.. బెంగళూరులో వర్ష బీభత్సం.. రేపు కూడా…
భారత వాతావరణ శాఖ బెంగళూరుతో పాటు ఇప్పటికే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
- Naveen
- Updated on- April 29, 2026 / 08:53 PM IST
Bengaluru Rain: బెంగళూరు నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి.
భారత వాతావరణ శాఖ బెంగళూరుతో పాటు ఇప్పటికే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. వర్షం కారణంగా బెంగళూరులో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణం చల్లబడింది. ఎండల దెబ్బకు విలవిలలాడిన నగరవాసులు కాస్త సేద తీరారు. గరిష్ణ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది.
Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపు ఎవరిది? ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్..
భారీ వర్షం బెంగళూరులో బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు నగరవాసులను వణికించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. తూర్పు, ఉత్తర బెంగళూరులోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేసింది. కల్యాణ్ నగర్, బనసవాడి, ఆర్టీ నగర్ పరిసరాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ లో ఎంజీ రోడ్, శివాజీ నగర్, కబ్బన్ పార్క్ ప్రాంతాల్లో భారీ వాన పడింది. దక్షిణ బెంగళూరులోని జయనగర్, జేపీ నగర్, బనశంకరి ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
ఐటీ కారిడార్ లో వైట్ ఫీల్డ్, సర్జాపూర్ రోడ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. ఇక బెంగళూరు నగరంలో దాదాపు 20 కంటే ఎక్కువ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లపై చెట్ల పడటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాన బీభత్సంతో వాహనాలు దెబ్బతిన్నాయి. పార్క్ చేసి ఉన్న కార్లు, బైక్ లపై చెట్లు పడటంతో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. కరెంట్ వైర్లపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
