కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్-4 మే 31 ఆదివారంతో ముగియనుంది. ఈనేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్ధితి, లాక్ డౌన్ కొనసాగింపు, దేశ ఆర్ధిక పరిస్ధితి, కరోనా నియంత్రణకు చేపడుతున్నచర్యలను వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈనెల 31తో లాక్ డౌన్-4 ముగియ నుండటంతో దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలన్న ప్రతిపాదనపై అమిత్ షా గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఏఏ రంగాలకు మినహాయింపులు ఇవ్వాలి, దేశంలో ఎలాంటి సమస్యలున్నాయి వంటి పలు అంశాలను అమిత్ షా వారితో చర్చించారు. ముఖ్యమంత్రులు ఏం చెప్పారనే విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ …ఎక్కువ మంది లాక్ డౌన్ పోడిగించమనే కోరినట్లు సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది.
ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే.. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రులు కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయాన్ని శని, ఆదివారాల్లో ప్రకటించే అవకాశముంది. మరోవైపు లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించాల్సిందేనని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అభిప్రాయపడ్డారు.