Char Dham Yatra: చార్ ధామ్.. ట్రాఫిక్ జామ్.. 30 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

టూరిస్టులు వాహనాల్లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Updated on- May 31, 2026 / 09:04 PM IST

Char Dham Yatra: పర్యాటకులు, భక్తులు ఉత్తరాదికి పోటెత్తారు. సెలవులు కావడంతో టూరిస్టుల రాకతో పర్యాటక ప్రాంతాలు భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ కు భక్తులు పోటెత్తారు. కేదార్ నాథ్ కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ మార్గం మొత్తం భక్తులతో నిండిపోయింది.

బద్రీనాథ్ యాత్ర మార్గంలో కీలకమైన జోషి మఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. టూరిస్టులు వాహనాల్లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నడక మార్గంలోని భీంబలి, లించోలి, జంగ్లీ చట్టి వంటి కీలక ప్రాంతాల్లో దారి అత్యంత ఇరుక్కుగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గుర్రాలు, పల్లకీలు, స్థానిక సేవా కార్యకర్తల రాకపోకలు వివిధ ప్రదేశాల్లో రద్దీని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా భక్తులు గంటల తరబడి రద్దీలో చిక్కుకుపోయారు. ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యేంత వరకు వీరంతా వేచి ఉండక తప్పని పరిస్థితి.

ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి సైతం టూరిస్టులు క్యూ కట్టారు. వేసవి కాలం కావడం, వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. డెహ్రాడూన్, ముస్సోరి రహదారిపై పర్యాటకుల రద్దీతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. వీకెండ్ సందర్భంగా కులు ప్రాంతానికి పర్యాటకులు రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పాల్చాన్ నుంచి మనాలీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read: క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బిల్లు ఎవరు కడతారు? బ్యాంకు ఎలా వసూలు చేస్తుంది?