S400: భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 సుదర్శన చక్ర.. పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టింది. ఇండియా సరిహద్దుల్లోని 15 ప్రాంతాల్లో మిస్సైల్, డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భగ్నం చేసింది ఎస్-400. పాక్ మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ను తుక్కుతుక్కు చేసింది ఎస్-400 సుదర్శన చక్ర. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న హెచ్ క్యూ-9 రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది.
లాహోర్, సియాల్ కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు.. చైనా తయారు చేసిన హెచ్ క్యూ-9 డిఫెన్స్ సిస్టమ్ ని సర్వ నాశనం చేశాయి. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లకు చెక్ పెట్టాయి. లాహోర్ తో పాటు 9 పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది. ఇజ్రాయెల్ అందించిన డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై స్వైర విహారం చేశాయి. ఇజ్రాయెల్ డ్రోన్ల దెబ్బకు పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకూ పనికి రాకుండా పోయింది.
సుదర్శన చక్రం పురాణాల్లో ఉంది. “సుదర్శన్” అని పిలవబడే S-400, ప్రపంచంలోనే అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి. ఇది రష్యా తయారు చేసింది. భారత వైమానిక దళం (IAF) కు చెందిన S-400 సుదర్శన్ చక్ర.. వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు, భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. భారత వైమానిక రక్షణ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటింది.
నిన్న రాత్రి భారత్ లోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి సహా అనేక సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడికి పాక్ ప్రయత్నించిందని రక్షణ మంత్రి తెలిపారు. ఈ దాడులను ఎస్-400 సమర్థవంతంగా భగ్నం చేసిందన్నారు.
ఏంటీ S-400 సుదర్శన్ చక్ర?
S-400.. ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి. పురాణాల్లో ఉన్న సుదర్శన చక్రం పేరుని దీనికి పెట్టారు. IAF కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిన ప్రతి S-400 స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి ఆరు లాంచర్లు, అధునాతన రాడార్ కలిగి ఉంటాయి. ఒక్కో బ్యాటరీ 128 క్షిపణులకు మద్దతిస్తుంది. భారత్.. రష్యా నుండి ఐదు స్క్వాడ్రన్‌లను కొనుగోలు చేసింది. వీటిలో మూడు ఇప్పటికే పని చేస్తున్నాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐదు S-400 స్క్వాడ్రన్‌ల కోసం 35వేల కోట్ల ఒప్పందం 2018లో జరిగింది.
S-400 సామర్థ్యాలు, ప్రభావం..
S-400 సుదర్శన్ 400 కి.మీ వరకు ఉన్న వైమానిక ముప్పులను గుర్తించగలదు, ట్రాక్ చేయగలదు, ఎదుర్కొనగలదు. స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు, క్రూయిజ్ లేదా బాలిస్టిక్ క్షిపణులు సహా. ఇందులో బహుళ క్షిపణి రకాలు ఉన్నాయి. ఇవి వివిధ దూరాలు, ఎత్తుల్లో ఏకకాల ముప్పులకు వ్యతిరేకంగా లేయర్డ్ రక్షణను అనుమతిస్తాయి. గతంలో జరిగిన IAF ఎక్సర్ సైజ్ లో సుదర్శన్ S-400 తన సత్తా చాటింది.
S-400 సుదర్శన్ చక్ర విజయవంతంగా మోహరించడం భారతదేశ వాయు రక్షణ కవచాన్ని గణనీయంగా బలోపేతం చేసింది. సాంప్రదాయ, అసమాన వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా విశ్వసనీయ నిరోధకాన్ని అందించింది. ఇది IAFకి నిజమైన గేమ్ ఛేంజర్‌గా మారింది.