India Crude Oil Stocks: దేశంలో ఎన్ని రోజులకు సరిపడా క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి? కేంద్రం కీలక ప్రకటన..

అనవసర భయాందోళనల కారణంగా ప్రజలు వస్తువులను కొనుగోలు చేయడం పెరుగుతోందని వాపోయారు. ఇంధన సరఫరాపై వదంతుల కారణంగా పెట్రోల్ వినియోగం 6శాతం పెరిగిందని వివరించారు.

  • Updated on- May 13, 2026 / 12:11 AM IST

India Crude Oil Stocks: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలో పలు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇంధర కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన వినియోగంపై ఆంక్షలు కూడా విధించాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత్ పై యుద్ధం ప్రభావం ఎంత? మన దేశంలోనూ ఇంధన సంక్షోభం తప్పదా? అనే ప్రశ్నలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలంటూ ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశంలో కలకలం రేపింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి అంటూ ప్రధాని మోదీ కోరడం ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించింది. ముందు ముందు భారత్ లోనూ తీవ్రమైన ఇబ్బందులు తప్పవేమో అని అంతా టెన్షన్ పడుతున్నారు.

ఈ తరుణంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో పలు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా భారత్‌కు ఆ భయం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎన్ని రోజులకు సరిపడా క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయో వాటి వివరాలు తెలియజేశారు.

దేశంలో 60 రోజులకు సరిపడా క్రూడాయిల్, 60 రోజులకు సరిపడా నేచురల్ గ్యాస్, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని సీఐఐ సదస్సులో చెప్పారు. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని 35 వేల టన్నుల నుంచి 55 వేల టన్నులకు పెంచామన్నారు. సంక్షోభాన్ని అవకాశాలుగా మార్చుకుంటున్నామని వివరించారు. అంతేకాదు తమ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

అయితే, అనవసర భయాందోళనల కారణంగా ప్రజలు వస్తువులను కొనుగోలు చేయడం పెరుగుతోందని ఆయన వాపోయారు. దేశంలో సరఫరా అదుపులోనే ఉందని, ఎక్కడా కొరత ఏర్పడినట్లు నివేదికలు లేవని మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఇంధన సరఫరాపై వదంతుల కారణంగా పెట్రోల్ వినియోగం 6శాతం పెరిగిందని వివరించారు.