Agra Cantt Railway Station: మహిళను కాపాడబోతే ఘోరం.. స్టేషన్ మాస్టర్‌ను ఈడ్చుకెళ్లిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. నలుగురు పోలీసులు సస్పెండ్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్(Agra Cantt Railway Station)లో ఆదివారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
RPF personnel dragged the station master at Agra Cantt Railway Station.
- ఆగ్రా కాంట్‌లో తీవ్ర ఉద్రిక్తత
- అధికారిపై పోలీసులు దారుణ దాడి
- నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెన్షన్
Agra Cantt Railway Station: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమృత్సర్ – విశాఖపట్నం హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) ఉదయం 10:51 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. రైలు తిరిగి బయలుదేరుతున్న సమయంలో, ప్రమాదకరంగా రైలు ఎక్కబోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని రక్షించేందుకు డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ వెంటనే స్పందించారు. ఆయన వాకీటాకీ ద్వారా సమాచారమిచ్చి రైలును ఆపించారు. అయితే, రైలు ఆగడానికి కారణం చైన్ పుల్లింగ్ అని పొరబడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, స్టేషన్లో ఉన్న ఒక జంటను అదుపులోకి తీసుకున్నారు.
అధికారిపై దారుణ ప్రవర్తన: సోషల్ మీడియాలో వైరల్:
ఈ తప్పుడు అరెస్ట్‌ను గమనించిన డిప్యూటీ స్టేషన్(Agra Cantt Railway Station) సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని ఆర్పీఎఫ్ సిబ్బందికి అసలు విషయం వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదరడంతో నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులందరూ చూస్తుండగానే సదరు అధికారి చేతులు, కాళ్లు పట్టుకుని దారుణంగా ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు, రైల్వే ఆపరేటింగ్ సిబ్బంది తీవ్ర నిరసనలకు దిగడంతో ఈ ఉదంతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెన్షన్, త్రిసభ్య కమిటీ విచారణ:
ఈ ఘటనపై నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివమ్ శర్మ స్పందిస్తూ.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధికారిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐలు మేఘరాజ్ మీనా, బాలకిషన్, కానిస్టేబుళ్లు జితేంద్ర, బదన్ సింగ్‌లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఘటనపై లోతైన దర్యాప్తు కోసం అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో కూడిన త్రిసభ్య కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై రైల్వే చట్టం ప్రకారం మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
