India Gold Imports : దేశంలో ప్రజల వద్ద 32వేల టన్నుల బంగారం నిల్వలు.. అందులో కేవలం 1శాతం రీసైక్లింగ్ చేస్తేచాలు.. ఆ తరువాత ఏం జరుగుతుంది?

India Gold Imports : భారతీయ కుటుంబాలు, దేవాలయాలు వద్ద మొత్తం కలిపి సుమారు 32వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు కేంద్రం అంచనా. ఈ బంగారం విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

India Gold Imports

India Gold Imports : బంగారంతో భారతదేశానికి ఉన్న అనుబంధాన్ని ఎంత చెప్పినా తక్కువే. పెండ్లిళ్లు, పండుగల నుండి వారసత్వం, పెట్టుబడి వరకు భారతీయుల ఇండ్లలో ఈ బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, భారతీయులు ప్రతి సంవత్సరం బంగారం కొంటూనే ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఇండ్లలో ఇప్పటికే భారీ మొత్తంలో వాడని బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే, గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం కొత్తగా దిగుమతి చేసుకున్న బంగారంపై ఆధారపడకుండా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని తిరిగి వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని మోదీ సూచన వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం. దేశంలోకి బంగారం దిగుమతులను తగ్గించడం.

Also Read : Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే.. ఈ నెలలోనే మరో 1800 పోస్టులు..

భారతీయ కుటుంబాలు, దేవాలయాలు వద్ద మొత్తం కలిపి సుమారు 32వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు కేంద్రం అంచనా. ఈ బంగారం విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ భాగం లాకర్లలో, అలమరాల్లో ఉపయోగం లేకుండా ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రజల వద్ద ఉన్న బంగారంలో కొంతభాగం అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి వచ్చినా.. దాని ప్రభావం గణనీయంగా ఉండవచ్చు.

బంగారం రీసైక్లింగ్ అంటే సరిగ్గా ఏమిటి?
పాత నగలు, విరిగిన ఆభరణాలు, నాణేలు, బంగారు బార్లు లేదా ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని బంగారాన్ని సేకరించి శుద్ధి చేసి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా మార్చడాన్ని గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలో బంగారాన్ని 99.9% స్వచ్ఛత వరకు శుద్ధి చేసి మళ్లీ నగలు లేదా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భారతదేశంలో బంగారం దిగుమతులు తగ్గుతాయి. తద్వారా ఆర్థిక భారం తగ్గి, బంగారం ధరలు అదుపులోకి వస్తాయి.

ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది?
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల కోసం సుమారు 72.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. బంగారం దిగుమతులకు విదేశీ మారక నిల్వలు (Forex Reserves) వినియోగించాల్సి వస్తుంది. దీంతో దేశపు ప్రస్తుత ఖాతా లోటు (Current Account Deficit), విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. సులభంగా చెప్పాలంటే.. రీసైకిల్ చేసిన ప్రతి గ్రాము బంగారం ఇతర దేశాల నుంచి భారత దేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని ఒక గ్రాము తగ్గిస్తుంది. “బంగారం నగదీకరణ పథకం, అత్యవసరం కాని బంగారు కొనుగోళ్లను వాయిదా వేయాలన్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ విజ్ఞప్తి ద్వారా.. ప్రభుత్వం ఈ నిద్రాణమైన సంపదను సమీకరించడం, కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) ను తగ్గించడం, విదేశీ మారకపు ఒత్తిడిని తగ్గించడం, ఇప్పటికే ఉన్న గృహ నిల్వల నుండి దేశీయ సరఫరా గొలుసును సృష్టించడం ద్వారా దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని ఛాయిస్ బ్రోకింగ్‌లోని కమోడిటీ అనలిస్ట్ కావేరి మోర్ ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో చెప్పారు.

కేవలం 1శాతం బంగారం రీసైకిల్ చేసినా..
నిపుణుల అంచనా ప్రకారం.. ఇండ్లలో, దేవాలయాల్లో ఉన్న బంగారంలో కేవలం ఒక శాతం మాత్రమే ప్రతి సంవత్సరం రీసైకిల్ చేసినా, భారతదేశ బంగారం దిగుమతులు 25శాతం నుంచి 30శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనిద్వారా విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. దేశ ఆర్థిక స్థిరత్వానికి మేలు జరుగుతుంది. వాస్తవానికి.. భారతీయ సంస్కృతిలో బంగారం సంపదకు, భద్రతకు, వారసత్వానికి ప్రతీక. పెండ్లిళ్లు, బహుమతులు, వారసత్వ సంపద రూపంలో వచ్చిన బంగారం చాలా కుటుంబాల్లో సంవత్సరాల నుంచి ఉపయోగించకుండా పలు విధాల్లో భద్రతపర్చి ఉంది. అయితే, పాత డిజైన్ల నగలను కొత్తవిగా మార్చుకోవడం ద్వారా లేదంటే నగదుగా మార్చుకోవడం ద్వారా ఆ బంగారం మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. దీని ద్వారా భారతదేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది బలోపేతం అవుతుంది.