Rafale Fighter Jets
Rafale fighter jet: భారత వాయుసేన అమ్ములపొదిలో మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలు చేరే అవకాశం ఉంది. ఫ్రాన్స్ నుంచి రూ.3.25 లక్షల కోట్లతో రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రతిపాదనలకు భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని “రక్షణ కొనుగోళ్ల మండలి” (డీఏసీ) ఈ మేరకు అధికారికంగా క్లియరెన్స్ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కొన్ని రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న వేళ డీఏసీ నుంచి ఈ క్లియరెన్స్ రావడం గమనార్హం. ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నుంచి కూడా ఈ డీల్‌కు క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది.
ప్రతిపాదనల ప్రకారం.. ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ 18 “ఆఫ్-ది-షెల్ఫ్” రాఫెల్ యుద్ధ విమానాలను కొంటుంది. అంటే ఇప్పటికే ఆ కంపెనీ వద్ద సిద్ధంగా ఉన్న 18 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది.
మిగతా 96 యుద్ధ విమానాలు భారత్‌లో తయారవుతాయి. శిక్షణ కోసం వీటిలో కొన్నింటిని ఇద్దరు కూర్చునేలా రూపొందిస్తారు. అలాగే, రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికత బదిలీ కూడా భారత్-ఫ్రాన్స్ ఒప్పందంలో ఉంటుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మేకిన్ ఇండియాకు మరింత ఊతమివ్వనుంది.