అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే: హైపర్‌సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం
- venkaiahnaidu
- Updated on- September 7, 2020 / 04:51 PM IST
India joins US, Russia, China hypersonic Missile club: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్ ని విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘హైపర్‌సోనిక్ సాంకేతిక క్షిపణి వాహక నౌక’ (HSTDV)ను సోమవారం ఒడిశా వీలర్ ఐలాండ్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రయోగించారు.
ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్క్రామ్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో హైపర్‌సోనిక్ వెహికిల్‌ను డీఆర్‌డీవో పరీక్షించినట్లు రాజ్‌నాథ్ సింగ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గొప్ప విజయాన్ని సాధించిన డీఆర్డీఓకు శుభాకాంక్షలు. ప్రధాని మోడీ కల- ఆత్మనిర్భర్ భారత్ వాస్తవ రూపం దాల్చడానికి ఇది కీలక పరిణామం. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు
https://10tv.in/chinas-cnbg-sinovac-find-more-countries-to-test-coronavirus-vaccines/
భవిష్యత్తులో సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలకు ఇది ఆసరాగా నిలిచి, వైమానిక అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల అత్యంత సంక్లిష్టమైన సాంకేతికత భారత్ సొంతమైందని డీఆర్‌డీఓ అధికారి ఒకరు చెప్పారు. దేశీయ రక్షణ పరిశ్రమల భాగస్వామ్యంతో కొత్త తరం హైపర్‌సోనిక్ వాహక నౌకల నిర్మాణానికి ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటికే హైపర్‌సోనిక్ టెక్నాలజీ ఆయుధాలు సమకూర్చుకోవడంలో అమెరికాతోపాటు రష్యా, చైనా దేశాలు ముందున్నాయి. తరువాత ఫ్రాన్స్, భారత్, ఆస్ట్రేలియా కూడా ఈ తరహా టెక్నాలజీ పరీక్షల్లో నిమగ్నమయ్యాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ హైపర్‌సోనిక్ టెక్నాలజీతో భారత్ ఆ మూడు దేశాల సరసన చేరింది.
