India – UK FTA : భారత్ – యూకే డీల్ అమల్లోకి వచ్చేసింది.. భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..

India - UK FTA : భారత్, యూకే మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.

India-UK deal comes into effect; prices of these goods set to drop significantly

India – UK FTA : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో దాదాపు అన్ని భారతీయ ఎగుమతులకు యూకే మార్కెట్లో సుంకం లేకుండా ప్రవేశం లభించనుంది. అదే సమయంలో బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై భారత్ దశలవారీగా దిగుమతి సుంకాలను తగ్గించనుంది.

Also Read : Sugar Molecules : అంతరిక్షంలో ‘చక్కెర’ ఆనవాళ్లు.. జీవం ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించే దిశగా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ఈ వాణిజ్య ఒప్పందంపై 2025 జులై 24న లండన్ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, యూకే బిజినెస్ అండ్ ట్రేడ్ కార్యదర్శి జోనాథన్ రేనోల్డ్స్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పాల్గొన్నారు. దాదాపు ఏడాది తరువాత ఈ ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.

యూకే – భారత దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా.. భారత దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 99శాతం మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిగా బ్రిటన్‌కు చెందిన ఎంపిక చేసిన ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో దశలవారిగా తగ్గించనుంది.

ఈ ఒప్పందంతో భారతీయ వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులు యూకే మార్కెట్లోకి తక్కువ లేదా సున్నా సుంకాలతో వెళ్లనున్నాయి. దీంతో భారతీయ కంపెనీలకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు.. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులు భారత్‌లో చౌకగా లభించనున్నాయి. ప్రస్తుతం స్కాచ్ విస్కీపై ఉన్న 150శాతం దిగుమతి సుంకం వెంటనే 75శాతంకు తగ్గుతుంది. తరువాత కాలంలో దానిని 40శాతంకు తగ్గిస్తారు. జిన్ పై కూడా ఇదే విధమైన సుంకం తగ్గింపు ఉంటుంది. అలాగే సైడర్, మీడ్, సాకే, బ్రాండీ, బోర్బన్, రమ్, వోడ్కా, లిక్కర్లు, టెకిలా వంటి ఇతర ప్రీమియం మద్యం ఉత్పత్తులపై సుంకం మొదటి ఏడాదిలో 150 శాతం నుంచి 110 శాతానికి, తరువాత కాలంలో 75 శాతానికి తగ్గుతుంది. అయితే ఈ రాయితీలు కనీస దిగుమతి ధర (లీటరుకు సుమారు 5 నుంచి 6 డాలర్లు) కంటే ఎక్కువ ధర కలిగిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి.

బ్రిటన్ నుంచి పూర్తిగా తయారై, దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై టారిఫ్‌లు 110శాతం నుంచి క్రమంగా 10శాతానికి పరిమితం అవుతాయి. అదేవిధంగా బ్రిటన్ నుంచి మన దేశంలోకి దిగుమతి అయ్యే సాల్మన్‌ చేపలు, గొర్రెపిల్ల మాంసం, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, చాకోలెట్లు, సాఫ్ట్‌ డ్రింక్‌లు, కాస్మోటిక్స్, సబ్బులు, పర్‌ఫ్యూమ్‌లు, షేవింగ్‌ క్రీములు, నెయిల్‌ పాలిష్‌ల ధరలు దశల వారీగా తగ్గనున్నాయి. అదేవిధంగా శస్త్రచికిత్స పరికరాలు, డయాగ్నస్టిక్ పరికరాలు, ఈసీజీ యంత్రాలు, ఎక్స్ రే పరికరాలపై సుంకాలు తగ్గనున్న నేపథ్యంలో కొంతమేర ప్రయోజనం కలగనుంది.

ఈ ఒప్పందం వల్ల వస్త్ర పరిశ్రమ, తోలు పరిశ్రమ, సముద్ర ఆహార రంగం, ఆటో విడిభాగాలు, రసాయనాలు, రత్నాలు-ఆభరణాల రంగాలకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. అయితే రైతులు, పాడి పరిశ్రమను రక్షించేందుకు పాలు, చక్కెర, బియ్యం వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఒప్పందం నుంచి మినహాయించారు.

తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాసెస్ట్ ఫుడ్, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆలో కాంపోనెంట్లు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, వస్త్రాలు, దస్తులు, రసాయనాలు, ఔషధాలకు సంబంధించి భారత ఎగుమతిదారులకు యూకే మార్కెట్లలో జీరో సుంకం ప్రయోజనం లభిస్తుంది.